ట్రాఫిక్ చలానా కూడా కట్టని పవన్ కల్యాణ్ ఆదర్శ నాయకుడేనా?

Update: 2019-01-12 06:14 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం అంటే యువతకు క్రేజ్. ఆయనకు చే గవేరా ఆదర్శం.. భగత్ సింగ్ స్ఫూర్తి.. మహాత్మాగాంధీ మార్గదర్శి.. ఒకరేమిటి..గొప్పగొప్ప వారంతా పవన్‌ కు స్ఫూర్తి ప్రదాతలే. అందుకే.. తాను మైకు పట్టుకుంటే చాలు నీతి సూత్రాల ప్రవాహం పరవళ్లు తొక్కుతుంది. ప్రభుత్వాల బాధ్యతలు, ప్రజల బాధ్యతలు అన్నీ చెబుతారు. తాను ఒక బాధ్యతాయుతమైన పౌరుడినంటారు. కానీ.... హైదరాబాద్ సిటీ పోలీసుల చిట్టా చూస్తే మాత్రం ఈ ఆదర్శ నేత ఎన్నిసార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించారు.. ఫైన్ కట్టకుండా ఎన్ని సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారో తెలుస్తుంది.
   
నో పార్కింగ్ జోన్లో వాహనాన్నిపార్కింగ్ చేసినందుకు గాను పవన్‌ కళ్యాణ్‌ ‌పై మూడు చలాన్లు పెండింగ్‌ లో ఉన్నాయి. 2016 నుంచి ఆయన ఈ రూ.505 ఫైన్‌ ను చెల్లించలేదు. నిజానికి ఇదేమీ పెద్ద మొత్తం కాకపోవచ్చు.. కానీ, ట్రాఫిక్ ఉల్లంఘనే. పైగా నిత్యం నీతులు చెప్పే పవన్ ఇలాంటి చిన్న విషయాలు ఎందుకు పట్టించుకోరని.. ఆయనే ఇలా ఉంటే ఆయన అభిమానులకు ఇంకేం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
   
అయితే... ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, చలాన్లు చెల్లించకుండా తప్పించుకునే విషయంలో ఇతర సినీ హీరోల కంటే పవన్ ఎంతో నయమనే చెప్పాలి. మహేశ్ బాబు, బాలకృష్ణల సంగతి మరీ దారుణంగాఉంది.  మహేష్‌ బాబు పేరిట 7సార్లు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రూ.8,745 పెండింగ్‌ లో ఉన్నాయి. వీటిని 2016 నుంచి మహేష్‌ కట్టడం లేదు. నందమూరి బాలకృష్ణ 2018లో రాజేంద్రనగర్‌ వద్ద అతివేగంతో పయనించడంతో రూ.1035 ఫైన్‌ వేశారు. ఆయనా చెల్లించలేదు.  సునీల్‌, నితిన్‌ లాంటి హీరోల చలాన్లు కూడా పెండింగ్‌ లో ఉన్నాయి. పది చలాన్లు మించి పెండింగ్‌ లో ఉన్నట్లైతే వాహనాలను సీజ్‌ చేస్తామంటూ హైదరాబాద్‌ అదనపు ట్రాఫిక్‌ కమీషనర్‌ అనిల్‌ కుమార్‌ చెబుతూ వీరందరి చిట్టా విప్పారు.


Full View
Tags:    

Similar News