2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం శ్రమించిన జనసేన పార్టీ అధినేత - సినీనటుడు పవన్ కళ్యాణ్ తన ప్రచారం పర్వంపై ప్రస్తుతం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర పూర్తయిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ రథసారథిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి కారణం చంద్రబాబు అనుభవమేనని అన్నారు. అయితే దాని వల్ల ఒరిగింది నిష్ఫలమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేస్తే... రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి పోరాటం చెయ్యడం లేదని దానికి వాళ్లకు ఒత్తిడులు ఉన్నాయని అన్నారు.
ప్రత్యేక హోదా సంజీవని కాదన్న వారే నేడు అది కావాలని అడుగుతున్నారని పరోక్షంగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఎత్తిపొడిచారు. కేంద్రం ఏమి ఇవ్వడం లేదని తాను తిరుపతిలో సభ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే అప్పుడు స్పెషల్ ప్యాకేజి అనే దానిని అన్ని రాష్ట్రాలకు ఇచ్చే దానిని ఇచ్చారని..అప్పుడు అది పాచిపోయిన లడ్డులు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అవి విలువైన లడ్డులను వ్యాఖ్యానించారని పవన్ విమర్శించారు. వెనుకబడిన జిల్లాల నిధుల గురించి మాట్లాడకుండా రెవెన్యు లోటు గురించే మాట్లాడుతున్నారని...ఒత్తిళ్ళ కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారని విమర్శించారు.
చంద్రబాబు ఆఖిలపక్ష సమావేశం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఈ భేటీ కోసం తమకు లేఖ రాశారని కాని దాని వలన ఎలాంటి ఉపయోగం లేదని..టీ కాఫీలు తాగడానికి రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశాలని పవన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సమావేశాలు రెండేళ్ళ క్రితమే నిర్వహించాల్సి౦దని ఆయన అన్నారు. మంత్రులు ఇతర పార్టీల ప్రతినిధులతో మాట్లాడి ఏం చెయ్యాలో కార్యాచరణ రూపొందించాలని పవన్ అన్నారు. ముందుగా క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని, ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయాలని పవన్ కోరారు.