డబ్బుతోనే గెలిచిందట - తేల్చేసిన పవన్ కల్యాణ్!

Update: 2019-08-14 17:34 GMT
తను ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా పవన్ కల్యాణ్ తీరులో పెద్దగా మార్పు వచ్చినట్టుగా కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. ప్రజాతీర్పును అవమానించేలా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ తీరుతో వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన సంచలన విజయం పై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. అదంతా డబ్బుతో సాధించిన విజయం అని తేల్చేశారు.

ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు మూడు నెలలు కావొస్తున్న తరుణంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం డబ్బు వల్లనే గెలిచిందని ఈయన అన్నారు. డబ్బును పంచడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవంతం అయ్యిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

ఏదో అల్లాటప్పా విజయాన్ని సాధించి ఉంటే, లక్కీ భై చాన్స్ అన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే పవన్ ఇలాంటి మాటలు మాట్లాడినా అదో లెక్క. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించింది. రికార్డు స్థాయి మెజారిటీలు సాధించింది. అయినా ఆ విజయాన్ని కూడా పవన్ కల్యాణ్ కేవలం డబ్బుతో సాధించినది అని అనడం ఆయన తీరును తెలియజేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

డబ్బుతోనే గెలిచేట్టు అయితే అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఉన్న చంద్రబాబుకు అంతకన్నా అవకాశం ఉండదు. అయినా అడపాదడపా రాజకీయాలు చేస్తూ పవన్ కల్యాణ్ ఇలా ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా మాట్లాడటం ఆయన స్థాయిని మరింత తగ్గించి వేస్తూ ఉందని పరిశీలకులు అంటున్నారు! ఇకనైనా పవన్ కల్యాణ్ తీరు మార్చుకుంటే ఆయన కనీసం ఎమ్మెల్యేగా భవిష్యత్తులో అయినా నెగ్గే అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News