టార్గెట్ జ‌గ‌న్: ప‌వ‌న్ 100 రోజుల నివేదిక‌

Update: 2019-09-14 09:27 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీలో 100 రోజులు పూర్తి చేసుకున్న జ‌గ‌న్ స‌ర్కారుపై నివేదిక బాంబు పేల్చారు. కొన్ని రోజుల కిందట ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన ఆయ‌న జ‌గ‌న్ పాల‌న‌పై త‌మ నివేదిక ఉంటుంద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే తాజాగా నివేదిక‌ను వెలువ‌రించారు. అయితే, అంద‌రూ అనుకున్న‌ట్టే.. భారీ విమ‌ర్శ‌లు.. మ‌రింత భారీ ఎత్తిపోడుపులు - దూష‌ణ‌లతో నివేదిక‌ను వండి వార్చారు ప‌వ‌న్‌. కీల‌క‌మైన అంశాల్లో సూచ‌న‌లు స‌ల‌హాలు ఇవ్వాల్సింది పోయి.. విమ‌ర్శ‌ల‌తో స‌రిపుచ్చారు ప‌వ‌న్‌. త‌న పార్టీ గెలుపు కోసం ఆరాట ప‌డ‌ద‌ని - ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తుంద‌ని ప‌దే ప‌దే చెప్పుకొన్న ప‌వ‌న్‌.. ఈ క్ర‌మంలో నిర్మాణాత్మ‌క ప్ర‌తిప‌క్షంగా (ఒక్క ఎమ్మెల్యే ఉన్న‌ప్ప‌టికీ) మాత్రం పెద్ద‌గా పాత్ర పోషించ‌లేక పోయారు.

స‌రే! అస‌లు ప‌వ‌న్ త‌న వంద రోజుల నివేదిక‌లో ఏం చెప్పారో చూద్దాం.  గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా నడించిందని - వీటిని అరికడతామని గతంలో చెప్పిన జ‌గ‌న్‌.. ఈ విష‌యంలో వేసిన త‌ప్ప‌ట‌డుగుల కార‌ణంగా 19 లక్షల 34 వేల మంది రోడ్డునపడ్డారని దుయ్యబట్టారు.(నోట్ః ఇదే విష‌యంపై టీడీపీ వెల్ల‌డించిన నివేదిక‌లో .. 20 ల‌క్ష‌లుగా పేర్కొంది) ఇసుక కొరత వల్లే వారంతా ఉపాధి కోల్పోయారని - వంద రోజుల్లో ఇసుక విధానాన్ని తీసుకురాలేకపోవడం జ‌గ‌న్‌ అసమర్ధతకు నిదర్శనమని విమర్శించారు. నవరత్నాలు జనరంజకమే గానీ - పాలన మాత్రం జనవిరుద్దమని ఎద్దేవా చేశారు.

ఆర్ధిక శాఖపై సీఎం డ్యాష్ బోర్డులో ఎలాంటి సమాచారం లేదని - ప్రకాశం జిల్లాకు రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోతున్నాయని తూర్పారబట్టారు. శాంతి భద్రతలు క్షీణించాయని - పాఠశాలల్లో మౌలికవసతులు లేమి - దిగుబడులు తగ్గిపోయాయని నివేదికలో పవన్ వివరించారు. గ్రామ వ‌లంటీర్ వ్యవస్థ వల్ల  నష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని విమర్శించారు. వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం వైసీపీ త‌మ కార్యకర్తలను వాలంటీర్లుగా తీసుకొచ్చారని దుయ్య‌బ‌ట్టారు.  కృష్ణానదికి వరదలొస్తే మంత్రులు మాజీ ముఖ్యమంత్రి ఇంటిచుట్టూ తిరిగారని - అమాత్యులు బాధ్యతయుతంగా వ్యవహరించిలేదన్నారు. మంత్రి పదవులను హనీమూన్‌ లా భావిస్తున్నారని విమర్శించారు.

రైతులు విత్తనాల కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోతే మంత్రులు కనీసం సానుభూతి చూపలేద‌న్నారు.  డెంగీ - మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో సన్నద్ధత లోపించిందని దుమ్మెత్తిపోశారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు రూ.15 వేలు పెన్షన్ ఇస్తామన్నారని, ఈ మూడు నెలల్లో ఎన్ని పింఛన్లు అందాయో తెలియదని పవన్‌ ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణ పనులు నిలిచిపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమేనన్నారు.  మొత్తానికి ఇదీ ప‌వ‌న్ వెల్ల‌డించిన నివేదిక‌. అయితే, ఈ స్క్రిప్ట్‌ పై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిజానికి ప‌వ‌న్ కోణంలో చూసిన‌ప్పుడు దీనిలో ఏదో ప‌స లోపించింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News