విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ప్రసంగించిన పవన్ ....పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం స్థాపించక ముందు తమ కుటుంబంపై కుట్ర చేశారని....కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తన అన్న చిరంజీవిని రాజకీయంగా ఎదుర్కొనలేక ...శ్రీజను అడ్డు పెట్టుకున్నారని పవన్ మండిపడ్డారు. శ్రీజ ప్రేమ పెళ్లిని రాజకీయం చేసి తమ కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి ఘటనలు తనను ఎంతో బాధించాయని - తనకు కన్నీళ్లు తెప్పించాయని పవన్ అన్నారు. చిరంజీవి - తన లాంటి పలుకుబడి కలిగిన వ్యక్తులను కూడా కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం దెబ్బకొట్టారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
``నాలాంటి వ్యక్తిని - చిరంజీవి గారి లాంటి వ్యక్తులను కూడా కాంగ్రెస్ నాయకులు ఆనాడు ఇబ్బంది పెట్టారు. ఒక పదహారేళ్ల అమ్మాయి.......చిరంజీవి గారి చిన్న కూతురు...ముద్దు గా పెంచుకున్న కూతురు...అలాంటి ఆడపిల్లని....కాంగ్రెస్ నాయకులు కానీ...దానికి దోహదపడ్డ మిగతా నాయకులు అందరూ కలిసి....ఒక ఆడపిల్లను మోసం చేసి....ఢిల్లీ దాకా తీసుకెళ్లారు. అదీ మా కుటుంబ సమస్యను....ఇండియా అంతా రిలే షో చేశారీ దుర్మార్గులు....నేను వారిని అడుగుదామనుకున్నాను....మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా....ఆడపడుచులు లేరా....మా బిడ్డల జీవితాలు రోడ్డు మీద పెడతార్రా మీరందరూ.....వేదన కలిగింది....ఏడుపు వచ్చింది.....మా కుటుంబమంతా చాలా బాధపడ్డాం.`` అని ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.
కాగా, 2008లో శిరీష్ భరద్వాజ్ ను శ్రీజ ఆర్య సమాజ్ లో వివాహం చేసుకోవడం...తమ ప్రాణాలకు హాని ఉందని, రక్షణ కల్పించాలని...మీడియా ముందుకు వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కొన్ని మీడియా చానెళ్లు....ఆ వ్యవహారాన్ని అవసరానికి మించి హైలైట్ చేసి....టీఆర్పీల కోసం ఎపిసోడ్లు ప్రసారం చేశాయి. అదీగాక - వారిద్దరికీ కాంగ్రెస్ నాయకులే....ఆర్థికంగా - న్యాయపరంగా సాయం చేశారని టాక్ ఉంది.
చిరు కుటుంబం నుంచి వారిద్దరికీ ఎటువంటి బెదిరింపులు లేకపోయినా....వారికి కోర్టు రక్షణ కల్పించింది. ఆ తర్వాత తన లైసెన్స్ డ్ గన్ ను పవన్ పోలీసులకు అప్పగించాడు. చిరంజీవి కుటుంబం నుంచి శ్రీజకు ఎటువంటి హానీ లేదని చెప్పేందుకు అలా చేశానని పవన్ చెప్పారు. శ్రీజ క్షేమమే తమకు ముఖ్యమని చెప్పారు.