పవన్ సభా వేదికపై ఎవరు ఉంటారంటే...

Update: 2016-08-27 05:19 GMT
మరణించిన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని పరామర్శించడానికి తిరుపతి వెళ్లిన పవన్ గత రెండు రోజులుగా తిరుమలలోనే బస చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం మధాహ్నం ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయనుండటంతో శనివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో సుప్రభాత సేవలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సమయంలో టీటీడీ అధికారులు పవన్‌ కు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుని అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ సంగతులు ఇలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే సభపై తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి.

ఇప్పటికే తిరుపతిలోని ఇందిరా మైదానంలో పవన్ సభకు దాదాపు ఎన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ సభకు సంబంధించిన అనుమతి కోసం జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య అనుమతి కోరగా.. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే అనుమతి లభించింది. అంతా అనుకూలంగా జరుగుతున్న సమయంలో వాతావరణం కూడా అనుకూలిస్తే ఇంకా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ సభా వేదికపై ఎవరెవరు ఉంటారు అనే విషయంపై తాజాగా చర్చ జరుగుతుంది. ఈ సభపై స్థానిక జనసేన నాయకులు - స్థానిక కాపు సామాజిక వర్గ నేతలు - టీడీపీ - బీజేపీ లకు సంబందించిన స్థానిక నేతలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో అవన్నీ పుకార్లని తేలింది. ఈ సభా వేదికపై పవన్ కల్యాణ్ ఒక్కరే ఉంటారట.

ఈ తిరుపతి బహిరంగ సభ వేదికపై పవన్ ఒక్కరే ఉండి జనసేన కార్యకర్తలకు - అభిమానులకు దిశానిర్దేశం చేయనున్నారట. సభకు అనుమతి లభించిన గంట సేపూ పవన్ ఏకదాటిగా ప్రసంగించనున్నారని తెలుస్తుంది. ఈ గంటసేపు ప్రసంగంలో దాదాపు జనసేన కు సంబందించిన విషయాలే అన్నీ ఉంటాయని అంటున్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లను చూసుకునేందుకు హైదరాబాద్‌ కు చెందిన ప్రత్యేక బృందం తిరుపతికి వచ్చింది. మరోవైపు ఈ సభకు కేవలం చిత్తూరు జిల్లా అభిమానులకు మాత్రమే అనుమతి ఉందని తెలుస్తుంది. ఈ తిరుపతి సభ అనంతరం విజయవాడ లో కూడా సభ జరపాలని జనసేన ప్రణాలికలు రచిస్తోందట. ఇదే క్రమంలో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం.
Tags:    

Similar News