బాబు పాలనపై పవన్ ఏమన్నారు?

Update: 2016-04-11 07:05 GMT
జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ‘ప్రత్యేక’ ఇంటర్వ్యూలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎక్కడ చూసినా ఆయన వార్తలే దర్శనమిస్తున్నాయి. తాను సమయం ఇచ్చిన మీడియా సంస్థతో మినిమం గంట చొప్పున మాట్లాడిన ఆయన కారణంగా.. ఆయన చెప్పిన పలు అంశాలు బయటకు వస్తున్నాయి. ఆయన తాజాగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల నేపథ్యంలో ఇంటర్వ్యూలు ఇస్తున్నట్లు చెబుతున్నప్పటికీ.. సినిమా కంటే కూడా మిగిలిన అంశాల మీదనే ఆయన ఎక్కువగా మాట్లాడటం కనిపిస్తుంది. నిజానికి ఈ విషయంలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలే కారణంగా చెప్పొచ్చు.

తెలంగాణ ముఖ్యమంత్రి పాలన బాగుందన్న సమాచారం తన దగ్గర ఉందని.. తనకు చెప్పే వారంతా ఇదే మాట చెబుతున్నారన్న విషయాన్ని పవన్ చెప్పారు. కేసీఆర్ పాలన బాగుందన్న పవన్.. మరి.. తాను స్వయంగా ప్రచారం చేసి అధికారంలోకి తెచ్చిన ఏపీలోని బాబు సర్కారు మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బాబు పాలన మీద బాబుకు వస్తున్న ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది? ఏమని ఉందన్న విషయాన్ని చూస్తే.. బాబుకు ఏదో చేయాలని ఉన్నా.. ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థ ఆయన్ను ముందుకు పోనివ్వటం లేదన్న అభిప్రాయాన్ని పవన్ వ్యక్తం చేశారు. బాబు పాలన మీద తనకు వస్తున్న ఫీడ్ బ్యాక్ మిక్సెడ్ గా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఏదో చేయాలని బాబు ప్రయత్నం చేస్తున్నారని.. కానీ చేయలేకపోతున్నారన్న బాధను కూడా పడుతున్నట్లుగా పవన్ చెప్పటం గమనార్హం.

ఇక.. ఏపీ విపక్ష నేతల్ని అధికారపార్టీలోకి తీసుకెళ్లటాన్ని పవన్ తప్పు పట్టారు. తెలంగాణ అధికారపక్షం పైనా ఇదే తరహా అసంతృప్తిని వ్యక్తం చేసిన పవన్.. ఏపీ అధికారపక్షం తీరును కూడా తప్పు పట్టారు. పదవి.. అధికారం లేకుంటే ప్రజాసేవ చేయటానికి వీలు పడదా? అంటూ ప్రశ్నించిన పవన్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News