ఎర్రబలం లేకుంటే పవన్ ఢమాలేనా?

Update: 2018-04-06 09:25 GMT
పవన్ కల్యాణ్ చాలా డాంబికంగా ... నేషనల్ హైవేలను దిగ్బంధనం చేసేస్తాం.. ఢిల్లీ సర్కారు కదిలేలా చేస్తాం.. 14వ తేదీన గుంటూరు ప్రసంగంలో ప్రకటించారు. తీరా ఆయన చేయదలచుకున్నది దిగ్బంధనం కాదని.. కేవలం నేషనల్ హైవేల మీద కొద్దిదూరం నడక మాత్రమే అని.. మొన్న ప్రకటించారు. ప్రత్యేకహోదా సాధించడానికి హైవేల మీద ‘కొద్ది దూరం’ నడుస్తాం అని పవన్ ప్రకటించారు. అనగా సుమారుగా విజయవాడలోని బెంజి సర్కిల్ నుంచి రామవరప్పాడు జంక్షన్ దాకా అన్నమాట. అనగా సుమారు ఆరేడు కిలోమీటర్లు నడిచేసి.. ఆ దెబ్బతో హోదా సాధించేద్దాం అని పవన్ అనుకున్నారు. అందుకు ఆయన వామపక్షాలను కూడా కలుపుకున్నారు.

కానీ శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ తన మిత్రపక్షాలతో కలిసి విజయవాడ హైవేలపై సాగించిన యాత్ర కామెడీగా సాగిందనే చెప్పాలి. నేషనల్ హైవే మీద సుమారుగా 400 మంది కార్యకర్తలు కూడా లేకుండా.. పవన్ యాత్ర సాగడం గమనార్హం. అందులో కూడా.. వామపక్షాలకు ఎంతో బలమైన ప్రాంతం అయిన విజయవాడలో పాల్గొన్న కార్యకర్తలంతా దాదాపుగా లెఫ్ట్ పార్టీలకు చెందిన వారే. ప్రదర్శనలో , నడకలో కనిపించినవన్నీ ఎర్ర జెండాలే. జనసేన పార్టీ జెండాలు ఏదో మచ్చుకు ఓ పది వరకు ఉన్నాయి తప్ప.. హవా మొత్తం వారిదే కనిపించింది. ఒక్క మాటలో  చెప్పాలంటే.. వామపక్షాలు నిర్వహించిన నడకలో పవన్ కల్యాణ్ అతిథిలాగా పాల్గొన్నట్టు ఉన్నదే తప్ప.. పవన్ సొంతంగా లీడ్ చేస్తూ నడక సాగించినట్లు లేకపోవడం విశేషం.

పాపం పవన్ కల్యాణ్ తాము హైవేల మీద నడవడానికి పిలుపు ఇస్తే.. జనం వెల్లువతో రాష్ట్రం స్తంభించిపోతుందని అనుకున్నారు. ‘తమ పాదయాత్ర వలన జనజీవనానికి కాస్త ఇబ్బంది తప్పదు గానీ.. అందరూ సహకరించాలని’ ఆయన ముందే పిలుపు ఇచ్చారు. కానీ నిజానికి ఇవాళ సాగిన యాత్రకు అంత సీన్ లేకపోవడం విశేషం. జనానికి వారి నడక వల్ల ఇబ్బంది కలిగేంత ఎక్కువ మంది పాల్గొన లేదు.

అయితే పవన్ ఇలాంటి పాదయాత్ర ప్రకటించినప్పుడు.. ఆయన వెంట పోరాడ్డానికి రాకపోయినా... ఆయన క్రేజీ సినిమా హీరోగనుక రోడ్లపై నడిస్తే చూడ్డానికి ఎగబడే కుర్రకారు చాలా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ.. అలాంటి జనసందోహం  కూడా లేకుండా.. కేవలం నాలుగు వందలకు మించని కార్యకర్తలతో జనసేన- వామపక్షాల ఉమ్మడి ఉద్యమం పేలవంగా సాగిపోయింది. ఈ బలాన్ని నమ్ముకునే పవన్ అధికారంలోకి వచ్చేయగలనని రంకెలు వేస్తున్నారా అని జనం నవ్వుకుంటున్నారు.

Tags:    

Similar News