ఏపీలో ఆ ఫార్ములాను నమ్ముకున్న పవన్...వర్కవుటవుద్దా?

Update: 2020-12-22 15:38 GMT
ఏపీ రాజకీయాల్లో రాజకీయ నేతల పాదయాత్రకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్...స్టేట్ ఏదైనా పాదయాత్ర స్ట్రేటజీ మాత్రం సక్సెస్ ఫుల్. 2003లో దివంతగ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పాదయాత్ర ట్రెండ్ ను ఏపీకి పరిచయం చేశారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర ఆయనకు 2004లో అధికారాన్ని కట్టబెట్టింది. 2013లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా వైఎస్ బాటలో పాదయాత్ర చేసి 2014లో అధికారం దక్కించుకున్నారు. ఇక, 2019 ఎన్నికలకు ముందు దాదాపు 18 నెలల పాటు 134 నియోజకవర్గాల్లో 3,600 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేశారు. తన పాదయాత్ర సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకున్న జగన్...2019లో అవలీలగా భారీ మెజారిటీతో అధికారాన్ని అందుకున్నారు. 175 అసెంబ్లీ సీట్లకు గాను 151 గెలుచుకున్న వైసీపీ, 25 లోక్ సభ స్థానాలకు గాను 22 దక్కించుకుంది. వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్...అధికారం అందుకోవడానికి ముందు కాళ్లకు చక్రాలు కట్టుకొని రాష్ట్రమంతా చుట్టేశారు. అందుకే, ఈ సక్సెస్ ఫుల్ పార్ములాను ఫాలో అయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే జనసేనాని రాష్ట్రమంతటా పాదయాత్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

అందుకే, ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల షూటింగులను శరవేగంతో పూర్తి చేసి...2022 చివరి నాటికి పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని పవన్ అనుకుంటున్నారట. అందుకే, గతంలో ఏడాదికి రెండు సినిమాలు అతి కష్టమ్మీద పూర్తి చేసే పవన్...ఇలా వరుస బెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ నటిస్తోన్న వకీల్ సాబ్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఆ తర్వాత అయ్యప్పయున్ కోషియుమ్ రీమేక్...క్రిష్ ప్రాజెక్ట్, హరీష్ శంకర్ ప్రాజెక్ట్ లతో పాటు రామ్ తాళ్లూరితో పవన్ ఓ ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వీటి షూటింగులు పూర్తి చేసుకొని పవన్ ఫుల్ టైం పాలిటిక్స్ పై ఫోకస్ చేయబోతున్నారట. వకీల్ సాబ్, అయ్యప్పయున్ కోషియం రీమేక్ లు 2021లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. క్రిష్, హరీష్ శంకర్ ల సినిమాలు 2022లో విడుదలయ్యే చాన్స్ ఉంది. అప్పటి పరిస్థితులను బట్టి రామ్ తాళ్లూరి సినిమా గురించి పవన్ ఆలోచిస్తారని తెలుస్తోంది. 2024 ఎన్నికలను పవన్ డూ ఆర్ డై తరహాలో తీసుకుంటున్నారట. బీజేపీ-జనసేన కలిసి 2024లో ఏపీలో అధికారం చేపట్టాలని పవన్ గట్టిగా వ్యూహాలు రచిస్తున్నారట.

ఈ పాదయాత్ర నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ వంటి సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కూడా పవన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ తరహాలోనే 2024 ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే 2022లో పాదయాత్ర మొదలుబెట్టి ఎన్నికలకు ముందు ముగించాలని పవన్ భావిస్తున్నారట. క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోయిందని భావిస్తున్న పవన్.. తన పాదయాత్రతో 2024నాటికి జనసేనను తిరుగులేని శక్తిగా మార్చాలని ప్రణాళిక రూపొందిస్తున్నారట. మరోవైపు పవన్ పాదయాత్ర అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. 2024 ఎన్నికలకు ఏడాది...ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేస్తే పార్టీకి ఉపయోగపడుతుందని కొందరు అనుకుంటున్నారట. అయితే, పాదయాత్రపై గట్టిగా ఫిక్స్ అయిన పవన్... జగన్ లా కాకుండా పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారట. మరి, పవన్ పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుంది? పాదయాత్రతో పవన్ అధికారం దక్కించుకుంటారా లేదా అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
Tags:    

Similar News