ప‌వ‌న్ తెలంగాణ టూర్‌..చలోరే చ‌లోరే చ‌ల్‌...

Update: 2018-01-21 16:26 GMT
జనసేన అధ్యకుడు - ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ త‌న రాజ‌కీయ యాత్ర వేగం పెంచారు. చలోరే...చలోరే....చల్ పేరుతో పేరుతో తన నిరంతర ప్రజా యాత్రను నిర్వ‌హించ‌నున్నారు. మొద‌టి విడ‌త‌లో భాగంగా మూడు రోజుల పాటు యాత్ర సాగ‌నుంది. ఈ మేర‌కు ఆ పార్టీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  సోమవారం తొమ్మిది గంటల తరువాత హైదరాబాద్‌ లోని జనసేన పరిపాలన కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు.

జ‌న‌సేన పార్టీ వెలువ‌రించిన స‌మాచారం ప్ర‌కారం... హైదరాబాద్‌ లో బయలుదేరి జగిత్యాల జిల్లా లోని కొండగట్టు ఆలయానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చేరుకుంటారు. కొండగట్టు ఆలయంలోని ఆంజనేయస్వామికి పూజలు జరుపుతారు. అనంతరం తన యాత్ర ప్రణాళికను వెల్లడిస్తారు. సాయంత్రం కరీంనగర్ కు చేరుకొని జనసేనకు చెందిన స్థానిక ముఖ్య ప్రతినిధులతో మాట్లాడతారు.

ఆ మ‌రుస‌టి రోజు 23వ తేదీ కరీంనగర్‌లోని జగిత్యాల రోడ్‌ లో ఉన్న శుభం గార్డెన్స్ లో 10:45 నిమిషాలకు ఉమ్మడి కరీంనగర్ - నిజామాబాదు - ఆదిలాబాద్ జిల్లాల జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం భోజనం అనంతరం కొత్తగూడెం బయలుదేరి వెళతారు. సుమారుగా సాయంత్రం 6 .30 గంటలకు కొత్తగూడెం చేరుకుంటారు.రాత్రికి కొత్తగూడెంలో బస చేస్తారు.

24 వ తేదీ ఉదయం 9.30 కొత్తగూడెం నుంచి ప్రదర్శ‌న‌గా బయలుదేరి మధ్యాహ్నం 1.30 కి ఖమ్మం చేరుకుంటారు. 3 గంటలకు ఖమ్మం లోని ఎం.బి.గార్డెన్స్ లో జరిగే ఉమ్మడి ఖమ్మం - వరంగల్ - నల్గొండ జిల్లాల కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ కు పయనమవుతారు.
Tags:    

Similar News