అనంత నుంచే ప‌ర్య‌ట‌న‌..కేసీఆర్ స్మార్ట్ సీఎం:ప‌వ‌న్‌

Update: 2018-01-22 14:04 GMT
సినీనటుడు - జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ‌లో త‌న తొలి ప‌ర్య‌ట‌న పూర్తి చేసుకున్నారు. ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లా నుంచే తన పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ``నేను 2009 ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. నేను సంపూర్ణ రాజకీయ జీవితంలోకి రావాలనుకున్నప్పుడు కూడా కొండగట్టు అంజన్నను దర్శించుకోవాలనుకున్నాను. అందుకోసమే కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నా. ఆంజనేయస్వామిని నమ్మితే అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయనే నమ్మకం నాకు ఉంది`` అని వివ‌రించారు.

త‌న పర్యటన అనంతపురం జిల్లా నుంచి ఈ నెల 27 న ప్రారంభమవుతుందని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా క్లారిటీ ఇచ్చారు. `జ‌న‌సేన పార్టీ కార్యాలయాలు కూడా అనంతపురం జిల్లా నుంచే ప్రారంభించాం. అనంతపురం పర్యటన తర్వాత తదుపరి జిల్లాల పర్యటన తేదీలు ఖరారు చేస్తాం. అయితే.. ఒంగోలులో ఫ్లోరోసిస్ - కిడ్నీ బాధితులను కలుస్తాం. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనూ మా పర్యటన ఉంటుంది. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వెళ్తాం. జనసేన వేదికల ద్వారా రేపు - ఎల్లుండి పార్టీ కార్యకర్తల సమావేశాలు జరుగుతాయి. కార్యకర్ల సమావేశాల్లో సమస్యలు - సూచనలను స్వీకరిస్తాం. కార్యకర్తలతో ఆలోచించి ఏఏ సమస్యలపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై ముందుకెళ్తా" అని పవన్ కల్యాణ్ అన్నారు.

రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. `ఎంత బలం ఉందో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. రెండు నెలలముందు క్లారిటీ ఇస్తాను. నన్నేవరు వాడుకోవడం లేేదు. సమస్యలు కనబడితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇది చిన్న పార్టీ.. పాతిక సంవత్సరాల పోరాటం కోసం ప్రారంబించాం. బలమైన సంస్థాగత నిర్మాణం కోసంప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణాకి ఇంకా మేధావుల అవసరం ఉంది. ఆ మేదావులంతా జనసేనలోకి వస్తున్నారు` అని ప‌వ‌న్ అన్నారు. `ఓటుకి నోటు తప్పని తెలిసి కూడా ఆ రోజు మాట్లాడలేదు. పొలిటికల్ గొడవలెందుకని దానిపై మాట్లడలేదు.  పొలిటికల్ పార్టీలకు పొలిటికల్ ఎకౌంటిబులిటీ ఉండాలి. అమిత్ షా నన్ను బీజేపీలోకి రమ్మన్నారు. నిరాకరించాను` అని క్లారిటీ ఇచ్చారు. ఇక త‌నకు సినిమాలో కొనసాగాలని లేదని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. `నేను ఎవరిమద్దతు అడగలేదు. అడగను. ఒక సీఎంని కలిసి శుభాకాంక్షలు తెలిపితే తప్పేంటి? కేసీఆర్ హార్డ్ అండ్ స్మార్ట్ సీఎం` అని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News