వాళ్ల డ్రెస్సు.. చదివే కోర్సు పవన్ కు అర్థం కాలేదు

Update: 2016-11-11 14:30 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అస్సలు అర్థం కాదు. అనంతపురం బహిరంగ సభ గురించి కొద్ది రోజల ముందే ప్రకటించినా.. సభ తర్వాత ఆయన ప్రోగ్రాం ఆయన తిరిగి హైదరాబాద్ తిరిగి వెళతారన్న మాటను పార్టీ వర్గాలు చెప్పాలి. కానీ.. అనూహ్యంగా ఆయన గుత్తికి వెళ్లి.. అక్కడి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

ఉదయం పది గంటల వేళ.. కిక్కిరిసిన కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు అడిగే ప్రశ్నలకు తాను సమాధానం ఇస్తానంటూ వారి ముందు నిలబడ్డారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ ను తాను ప్రశ్నించాలని అనుకుంటున్నట్లుగా ఒక అమ్మాయి చేసిన వ్యాఖ్యకు పవన్ తనదైన శైలిలో నవ్వేశారు. ప్రశ్నించమని కోరారు. ఆమె ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానం చెప్పి సంతృప్తిపరిచారు.

అనంతరం విద్యార్థులు పలువురు తమ ప్రశ్నల్ని సంధించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పేర్లను.. తాము చేస్తున్న కోర్సులను చెప్పి తమను తాము పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక అమ్మాయి తన గురించి చెబుతూ.. తాను ట్రిఫుల్ ఈ చదువుతున్నట్లుగా చెప్పింది. అయితే.. ఆమె చెప్పిన ట్రిఫుల్ ఈ అన్నది పవన్ కు అర్థం కాలేదు. ఒకటికి నాలుగుసార్లు చెప్పినా పవన్ కు అర్థం కాకపోవటంతో కళాశాలకు చెందిన ఒకరు పవన్ వద్దకు వచ్చి ట్రిపుల్ ఈ అంటే ఏమిటో చెప్పారు. తాను పెద్దగా చదువుకోలేదని.. అందుకే తనకీ కోర్సులు తెలీవని చెప్పటంతో అక్కడి విద్యార్థులు పెద్దగా నవ్వేశారు.

అనంతరం ఇద్దరు అమ్మాయిలు పవన్ కు ప్రశ్నలు వేసే క్రమంలో వారు కోటు ధరించటం చూసి.. మీరెందుకు అలా డ్రెస్ వేసుకున్నారని ఆసక్తిగా ప్రశ్నించారు. తాము ఎంబీఏ విద్యార్థులమని వారు చెప్పారు. ఇలా.. విద్యార్థులు చేసే కోర్సుల గురించి.. వారు వేసుకునే డ్రెస్సుల గురించి ప్రత్యేకించి అడగటం పలువురి దృష్టిని ఆకర్షించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News