సినిమా రిలీజ్ వ‌ర‌కూ నో తెలంగాణ ఇష్యూస్‌!

Update: 2017-12-24 05:24 GMT
ప్ర‌శ్నించేందుకు రాజ‌కీయ పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు రోటీన్‌కు భిన్నంగా ఉంటుంది. చూసేందుకు రెబ‌ల్ గా క‌నిపిస్తూ.. ప‌వ‌ర్ ఫుల్ పంచ్ లు త‌గిలేలా మాట్లాడిన‌ట్లు క‌నిపించినా.. మాట‌ల వెనుక ఆచితూచి అనే వ్యూహం ప‌క్కాగా ఉండ‌టం క‌నిపిస్తుంటుంది.

ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయ అంశాల్ని త‌ర‌చూ ప్ర‌స్తావిస్తూ వార్త‌ల్లో క‌నిపిస్తున్న ప‌వ‌న్ మాట‌ల్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. ఏపీ అంశాలు మాత్ర‌మే క‌నిపిస్తాయి. తెలంగాణ‌ రాష్ట్రానికి సంబంధించిన ఒక్క స‌మ‌స్య‌ను ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ టేక‌ప్ చేయ‌లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ప్ర‌జ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌లు ఎక్క‌డైనా ఒకేలా ఉంటాయే కానీ ఆంధ్రాలో ఒక‌ర‌కంగా.. తెలంగాణలో మ‌రో ర‌కంగా ఉండ‌వు. కానీ.. ఏపీ మీద మాత్ర‌మే ప‌వ‌న్ ఫోక‌స్ పెట్ట‌టం గ‌మ‌నార్హం.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌చారాన్ని నిర్వ‌హించిన ప‌వ‌న్‌.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త‌న పార్టీ ఉంద‌న్న విష‌యాన్ని త‌ర‌చూ చెబుతుంటారు. మ‌రి.. అదే నిజ‌మైతే.. ఏపీలో త‌ర‌చూ కార్య‌క్ర‌మాలు నిర్వ‌ర్తిస్తున్న జ‌న‌సేన అధినేత‌.. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించ‌టం లేద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం రాని ప‌రిస్థితి.

తాజాగా అందుతున్న స‌మాచారం చూస్తే.. ప‌వ‌న్ త‌న తాజాగా చేస్తున్న సినిమా విడుద‌ల త‌ర్వాత మాత్ర‌మే తెలంగాణ ఇష్యూస్ మీద గ‌ళం విప్పుతార‌న్న మాట బ‌లంగా వినిపిస్తుంది. రాజ‌కీయం సంగ‌తి ఎలా ఉన్నా.. త‌న మీద కోట్లాది రూపాయిలు పెట్టుబ‌డులు పెట్టిన నిర్మాత‌కు ఎలాంటి ఇబ్బందులు జ‌ర‌గ‌కుండా ఉండేందుకే ఆయ‌న ఆచూతూచి అన్న‌ట్లుగా అడుగులు వేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న  ప్ర‌చారానికి ఫ‌లితం అన్న‌ట్లుగా అక్క‌డ తాను మ‌ద్ద‌తు ఇచ్చిన ప్ర‌భుత్వం ప‌వ‌ర్‌లోకి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో తెలంగాణలో ప‌వ‌న్ ప్ర‌భావం పెద్ద‌గా ప‌డ‌లేదు. ఆయ‌న మ‌ద్ద‌తు ఇచ్చిన పార్టీకి వ‌చ్చిన సీట్లు అరకొర మాత్ర‌మే. రాజ‌కీయంగా త‌న‌కు ప‌ట్టు లేక‌పోవ‌టం.. ప‌వ‌న్ దృష్టి మొత్తం ఏపీ రాజ‌కీయాల చుట్టూ తిరుగుతుంద‌ని చెప్ప‌క త‌ప్పదు.

తెలంగాణ‌తో పోలిస్తే ఆంధ్రాలోనే త‌మ పార్టీకి చ‌క్క‌టి భ‌విష్య‌త్తు ఉన్న నేప‌థ్యంలో తాను లేవ‌నెత్తిన ఇష్యూలు  డైవ‌ర్ట్ కాకుండా ఉండ‌టానికి వీలుగా.. తెలంగాణ ఊసే ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది. త‌న మాట విష‌యంలో ఏపీ స‌ర్కారు స్పందించే తీరుకు.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు రియాక్ట్ అయ్యే తీరులో తేడా ఉండ‌టంతో.. ముందు త‌న మాట‌కు ఉండే ప‌వ‌ర్ ఎలా ఉంటుందో తెలియ‌ జెప్పే ప్ర‌య‌త్నం ప‌వ‌న్ చేస్తున్నార‌ని చెబుతున్నారు. త‌న తాజా చిత్రం విడుద‌ల‌య్యాకే తెలంగాణ స‌మ‌స్య‌ల మీద దృష్టి పెట్టే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎంత ప‌వ‌ర్ స్టార్ అయినా.. రియ‌ల్ ప‌వ‌ర్ ముందు ఆచితూచి అడుగులు వేయాల్సిందేగా?
Tags:    

Similar News