జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ నేత టీజీ వెంకటేష్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ముందుగా టీజీ వెంకటేష్ ఏదో అన్నారు. దానికి కోపం తెచ్చుకున్న పవన్, తను వదిలేసిన రాజ్యసభ సీట్ పై కూర్చొని మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దీనికి ఆ వెంటనే టీజీ కూడా కౌంటర్ ఇచ్చారు. పవన్ ఆవేశం తగ్గించుకోవాలని, నాయకుడే ఆవేశపడితే ఎలా అని ప్రశ్నించారు. కార్యకర్తలకు ఆవేశం ఉండొచ్చని, నాయకుడికి ఆవేశం ఉండడం మంచిది కాదని, అప్పుడే భవిష్యత్ ఉంటుందని చురకలు అంటించారు.
పవన్ కల్యాణ్ కూడా తగ్గలేదు. టీజీ వ్యాఖ్యలకు వెంటనే రియాక్ట్ అయ్యారు. విశాఖపట్నం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన జనసేనాని, టీజీ పేరు ప్రస్తావించకుండా మరోసారి ఆయనపై సెటైర్లు వేశారు.
"ఈ మధ్య ఎవరో తెలుగుదేశం నాయకులు నన్ను ఆవేశం తగ్గించుకోమని అన్నారు. అసలు ఆవేశం అనేది ఎవరికి ఉంటుంది. ఆవేదన ఉన్నవాడికే కదా ఆవేశం ఉండేది. కడుపు నిండిన వాడికి ఆవేశం ఎందుకుంటుంది. నా కడుపు మాత్రం దహించుకుపోతోంది. ఈ అన్యాయాలు, అక్రమాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఆవేశం రావడం తప్పా. ఓ మనిషికి కోపం వస్తే అది వ్యక్తిగతం. అదే ఒక సమూహానికి కోపం వస్తే అది ఉద్యమం."
త్వరలోనే అలాంటి ఉద్యమాన్ని జనసేన రూపంలో చూడబోతున్నారని పవన్ హెచ్చరించారు. ఇకనైనా మాటలు కట్టిపెట్టి ఈ 2-3 నెలలైనా ప్రజల కోసం పనిచేయాలని టీడీపీ నేతలకు, పరోక్షంగా టీజీకి సూచించారు పవన్.