ప‌వ‌న్ మాట:షా..బాబు మాట‌ల‌తో హోదాపై క్లారిటీ వ‌చ్చేసింది

Update: 2018-03-24 14:10 GMT
ఏపీలోని ప‌రిణామాల‌పై జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు ఘాటు స్పందించారు. తాజా ప‌రిణామాల‌ను చూస్తుంటే...ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధంగా లేద‌నే విష‌యం అర్థ‌మైంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న ప‌వ‌న్ త‌న అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సుదీర్ఘమైన లేఖ రాయడం - దానికి ప్రతిగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అంతే సుదీర్ఘంగా జవాబు ఇవ్వడం చూస్తుంటే ప్రత్యేక హోదా బీజేపీకి ఎప్పటికీ ఇవ్వదని, దానిని సాధించే స్థితిలో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం లేదన్న సంగతిని ప్రజలు మరింత అర్థం చేసుకున్నారని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

వేలాది కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చామని, వాటిని ఖర్చుచేయడంలో తెలుగుదేశం విఫలమైందని పాడిన  పాటనే అమిత్ షా మళ్లీ పాడారని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. అదేమాదిరిగా ఎప్పటిలాగానే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మరోసారి ఘోషించారని ఎద్దేవా చేశారు. `ఎందుకీ దాగుడు మూతలు? భారత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ఇరు ప్రభుత్వాలకు చెందిన అధికారులను కమిటీగా వేసి లెక్కలు కట్టి ప్రజలకు తెలియచేయవచ్చుగా?` అంటూ ప‌వ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు. `జనసేన చొరవతో ఏర్పాటైన జాయింట్ ఫాక్ట్ పైండింగ్ కమిటీ అధ్యయనంలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్ర‌భుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయవచ్చుగా? ఎంతకాలం ఈ ముసుగులో గుద్దులాట ?` అంటూ ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.

 విసిగివేసారిన ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరవధిక ఆందోళనలకు దిగే పరిస్థితులను దయచేసి కల్పించ వద్దని ప‌వ‌న్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా తప్ప మిగిలిన వాటి గురించి వినే స్థితిలో ప్రజలు లేరనే యదార్థాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిందని ప‌వ‌న్ అన్నారు. బీజేపీ - తెలుగుదేశం పార్టీల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ లో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితి పై చర్చించడానికి త్వరలో వామపక్షాల నాయకులతో చర్చలు జరపనున్నామని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివ‌రించారు. ప్రజల అభీష్టాన్ని నెరవేర్చడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఈ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ఆ తరువాత లోక్‌ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయ‌ణ వంటి అనుభవజ్ఞులతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు - మేధావులతో కూడా సమాలోచనలు జరుపుతామని ఆయ‌న వివ‌రించారు.
Tags:    

Similar News