చెప్పినట్లే పవన్..రోహిత్ గురించి మాట్లాడారు

Update: 2016-12-16 08:21 GMT
చేసేదే చెబుతానని.. చెప్పేదే చేస్తానన్నట్లుగా చెప్పే జనసేన అధినేత.. తాను చెప్పినట్లే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల గురించి పెదవి విప్పారు. గతంలో రోహిత్ ఆత్మహత్యపై ప్రశ్నించిన సమయంలో.. పెద్దగా రియాక్ట్ కానీ ఆయన.. తాజాగా మాత్రం రోహిత్ వేముల ఆత్మహత్య గురించి తాను మాట్లాడతానన్న విషయాన్ని ముందే ప్రకటించి మరీ ఈ రోజు ట్వీట్స్ చేయటం గమనార్హం.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్ కల్యాణ్.. బహిరంగ సభల అనంతరం.. గురువారం కొన్ని ట్వీట్లను పోస్ట్ చేయటం ద్వారా..బీజేపీ మీద తనకున్న ఆగ్రహాన్ని చెప్పకనే చెప్పేశారు. బీజేపీ మీదా.. ఆ పార్టీ నాయకత్వం మీద తనకున్న గుర్రును ట్వీట్ల ద్వారా వెల్లడించిన పవన్.. శుక్రవారం తాను రోహిత్ వేముల అంశంపై మాట్లాడతానని ప్రకటించారు.

ఇందుకు తగ్గట్లే ఈ రోజు మధ్యాహ్నం ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఆరు ట్వీట్లను రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రోహిత్ వేములపైనా.. అతడితో బీజేపీ వర్గాలు వ్యవహరించిన వైఖరిపై విమర్శనాస్త్రాల్ని సంధించారు. తొందరపాటుతో రోహిత్ వేముల ఏదో అన్నందుకు అతడ్ని క్యాంపస్ నుంచి పంపించి వేశారని.. అలా చేసినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పిన పవన్.. ఒకవేళ అతగాడికి కానీ కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే.. ఒక మేధావిని కోల్పోయేవాళ్లం కాదన్నారు.

రోహిత్ వేములకు బీజేపీ అంటే ఇష్టం లేదని.. అంతమాత్రాన అతడ్ని వేధించే అధికారం బీజేపీకి లేదన్న పవన్.. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారివిగా వ్యాఖ్యానించారు. రోహిత్ వేముల దళితుడు కాదని నిరూపించేందుకే కేంద్రం ప్రయత్నించిందన్న విమర్శ చేసిన పవన్.. రోహిత్ విషయంలో రాజకీయ జోక్యం ఏ మాత్రం సరికాదన్నారు. రోహిత్ అంశాన్ని బీజేపీ వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుందన్న ప్రశ్నను సంధించిన ఆయన.. రోహిత్ మరణాన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి రాజకీయం చేశాయన్నారు. విశ్వవిద్యాలయాలు రాజకీయ పార్టీలకు యుద్ధభూమి కాకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పవన్.. రోహిత్ ఇష్యూలో బీజేపీ తప్పు మీద తప్పు చేసిందన్న భావనను వ్యక్తం చేసేలా ట్వీట్ చేయటం గమనార్హం.

ప‌వ‌న్ ట్వీట్ల‌న‌ను యథాత‌ధంగా చూస్తే..

1.  లక్షలాది ఇతర భారతీయుల్లాగే రోహిత్‌ భాజపాను వ్యతిరేకించారు. అంతమాత్రాన భాజపా అతడిని వేధించాలా? ఓ పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించకుంటే.. వ్యక్తులను వేధించే లైసెన్సు వారికి ఎవరిచ్చారు?  అతడు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలుపుతున్నప్పుడు ఎలా  జోక్యం చేసుకుంటారు? ఇది బీజేపీకే కాదు.. ఏ రాజ‌కీయ పార్టీకైనా వ‌ర్తిస్తుంది.

2. ఒకవేళ రోహిత్ ప‌రిస్థితుల‌కు తొందరపడి కాషాయీకరణ గురించి విశ్వవిద్యాలయంలో తన వ్యతిరేక వర్గంతో ఏమైనా అని ఉన్నా.. కేంద్రం దాన్ని విద్యార్థుల దృక్పథాల మధ్య ఉన్న భేదంగానే చూడాలి. ఒక వేళ వారి మ‌ధ్య శత్రుత్వం శాంతిభద్రతలకు విఘాతం క‌లిగిస్తుంద‌ని భావిస్తే.. ఆయా విభాగాల‌ ద్వారా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. అంతే కానీ కేంద్రం ఈ విషయాన్ని ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుందో కారణం తెలియడం లేదు.

3. ఇలాంటి ప‌రిస్థితుల కార‌ణంగానే రోహిత్‌ వేములకు క్యాంపస్‌ నుంచి సస్పెన్షన్‌ తో పాటు వెలివేత శిక్ష పడింది. అదే అతడిని ఆత్మహత్యకు పురికొల్పింది. తన వర్గం నుంచి అవసరమైన నైతిక బలం లభించకపోవడం కూడా ఆత్మ‌హ‌త్య‌కు మరో కారణమైంది.

4. సమాజంలో సమానత్వానికి తావు లేదని తెలియడం వల్ల అతనికి కోపం - నిరాశ కలిగి వుంటాయి. మానవీయ దృక్పథంతో చ‌క్క‌టి కౌన్సెలింగ్ కానీ లభించి ఉంటే తాత్విక చింతన క‌లిగిన ఒక తెలివైన విద్యార్థి ప్రాణాలు కాపాడుకునేవాళ్లం.

5. రోహిత్‌ వేముల ఆత్మహత్యలో అత్యంత విచారకరమైన అంశం భాజపా వ్యతిరేక పార్టీలన్నీ దాన్ని రాజకీయం చేయడం. వారంతా తమకు అనుకూలంగా ఆ అంశాన్ని మ‌లచుకుంటే మరోవైపు బీజేపీ.. వారి మిత్రపక్షాలు ఆయన దళితుడు కాదని నిరూపించడంలో నిమగ్నమయ్యాయి. కానీ అందరూ ఒక ప్రశ్నను మాత్రం మర్చిపోయారు.. భవిష్యత్తులో యువత ఇలా నిరాశా నిస్పృహలతో ప్రాణాలు తీసుకోకుండా చూడాలంటే ఏం చేయాలనే విషయాన్ని వారు విస్మరించారు.

6. ఎప్పటికైనా మన విశ్వ‌విద్యాల‌యాలు విద్యా వేదికలుగా నిలుస్తాయని.. రాజకీయ పార్టీలకు యుద్ధభూములుగా మార‌వ‌ని ఆశిస్తాను.   



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News