మీడియా అని తెలీని బౌన్సర్లు ఉంటారా?

Update: 2015-10-17 08:50 GMT
సిత్రమైన మాటల్ని చెప్పుకొచ్చారు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఏపీ రాజధాని శంకుస్థాపన కోసం పవన్ కల్యాణ్ ను ఆహ్వానించేందుకు ఏపీ మంత్రుల బృందం వస్తుందన్న సమాచారం మీడియాకు తెలీటం.. ఆ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి బౌన్సర్లు మీడియా ప్రతినిధుల మీద దాడికి దిగారు.

ఈ సందర్భంగా పలువురు కెమెరామెన్ లకు గాయాలు కావటంతో పాటు.. కెమెరాలు ధ్వంసమయ్యాయి. దీనిపై పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేసి.. క్షమాపణలు తెలిపారు. తన షూటింగ్ జరిగే చోటకు చాలామంది వస్తుంటారని.. కొంతమంది కెమెరాలతో వస్తుంటారని.. అలా వచ్చిన వారిని సిబ్బంది అడ్డుకుంటారని.. అయినా జరిగింది పొరపాటని.. జరిగిన దానిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ షూటింగ్ జరిగే రామానాయుడు స్టూడియో వద్దకు పెద్ద ఎత్తున కెమెరాలతో వెళ్లి హడావుడి చేసిన ఉదంతాలు గతంలో చోటు చేసుకున్నాయా? అంటే లేవనే చెప్పాలి. మరి.. అలాంటిది వచ్చింది మీడియా సిబ్బందన్న విషయం తెలిసి దాడి చేశారన్నది స్పష్టం. దీన్ని కవర్ చేసేలా పవన్ మాట్లాడటం బాగోలేదన్న వాదన వినిపిస్తోంది. వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పటం.. దాడికి పాల్పడిన వారిని గుర్తించి సరైన పనిష్మెంట్ ఇస్తానని చెబుతున్న పవన్ కు ఒకే ఒక్కప్రశ్న అడాగాల్సిందే.

వచ్చింది మీడియా ప్రతినిధులో.. మామూలు వ్యక్తులో తెలుసుకోకుండా దాడులు చేసేవారు వ్యక్తిగత సిబ్బంది ఎలా అవుతారు? బౌన్సర్ల పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిని నియమించే వారిపైనా.. ఎంపిక చేస్తున్న వారిపైనా చట్ట బద్ధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  మీడియా సిబ్బందిని కొట్టేసి.. వారి కెమెరాల్నిధ్వంసం చేసే వైఖరిని సారీలతో సరిపుచ్చటం సరికాదేమో. బౌన్సర్లు అన్న వారు పరిస్థితి సరిదిద్దేలా వ్యవహరించాలే తప్పించి.. వారే సమస్యగా మారకూడదన్న విషయాన్ని పవన్ కల్యాణ్ లాంటి సెలబ్రిటీలు గుర్తిస్తే మంచిదేమో.
Tags:    

Similar News