అదేంది ప‌వ‌నా.. కేసీఆర్ మాట‌ల్ని వాడుతున్నావ్‌?

Update: 2018-05-19 04:10 GMT
45 రోజుల పాటు సాగ‌నున్న పోరాటయాత్ర‌కు స‌మాయుత్త‌మ‌వుతున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. త‌న‌ది బ‌స్సు యాత్ర ఎంత‌మాత్రం కాదంటూ చెబుతున్న ఆయ‌న‌.. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో జ‌రిపే యాత్ర‌తో భారీ ప్ర‌యోజ‌నాన్ని ఆశిస్తున్నారు. జ‌న‌సేన పార్టీ పెట్టిన త‌ర్వాత ఇంత సుదీర్ఘ యాత్ర‌ను ప‌వ‌న్ చేప‌ట్ట‌టం ఇదే తొలిసారి.

పోరాట‌యాత్ర‌కు ప్రిప‌రేష‌న్ గా దాదాపు ప‌ది రోజుల ముందు నుంచే వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌.. ఏపీ అధికార‌ప‌క్షాన్ని టార్గెట్ చేయ‌టం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. నాలుగేళ్ల పాటు బాబుకు మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించి.. హోదా మొద‌లుకొని వివిధ అంశాల మీద బాబు రియాక్ష‌న్ స‌రిగా లేద‌న్న అసంతృప్తితో ఫ్రెండ్ పోస్ట్ కు రిజైన్ చేసేసి బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే.

త‌న పోరాట‌యాత్ర‌ను ప్రారంభించ‌టానికి ముందు వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా ప‌వ‌న్ నోటి నుంచి వ‌స్తున్న కొన్ని వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. చిత్తూరు జిల్లాలో ఏపీ ముఖ్య‌మంత్రి కుమారుడు క‌మ్ ఏపీ మంత్రి లోకేశ్ పై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేయ‌టం ఒక ఎత్తు అయితే.. తాజాగా విశాఖ‌లోని గంగ‌వ‌రం గ్రామంలో మ‌రో త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌ను చేశారు.

ప్ర‌జాస‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌ని ఎమ్మెల్యేల‌ను గ్రామాల్లోకి రానివ్వ‌కండంటూ పిలుపునిచ్చిన ప‌వ‌న్‌.. మీరు ఓటు వేసి గెలిపించిన నాయ‌కుడ్ని నిల‌దీయండి.. ఆ హ‌క్కు మీకుందంటూ పిలుపునిస్తున్నారు. అంతేనా.. గ్రామాల్లోకి  రానివ్వొద్దంటూ ఆయ‌న కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మ స‌మ‌యంలో టీఆర్ఎస్ అధినేత‌గా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ సైతం ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌ల్ని చేసేవారు. తెలంగాణ ఉద్య‌మంలో పాలు పంచుకోని ప్ర‌జాప్ర‌తినిధుల్ని గ్రామాల్లో నిల‌దీయాల‌ని.. వారిని గ్రామాల్లోకి రానివ్వొద్దంటూ స్టేట్ మెంట్లు ఇచ్చేవారు.

పోరాట యాత్ర‌ను షురూ చేయ‌నున్న ప‌వ‌న్ నోటి నుంచి తాజాగా.. కేసీఆర్ త‌ర‌హాలో పిలుపు రావ‌టం గ‌మ‌నార్హం. నాలుగేళ్ల పాటు ఫ్రెండ్ షిప్ చేసి.. ఆ రోజుల్లో బాబు అనుభ‌వం అంటూ క‌వ‌ర్ చేసిన ప‌వ‌న్‌.. ఏపీ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబును స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మీద‌న ఒక్క‌రోజు కూడా నిల‌దీసింది లేదు. ప్ర‌శ్నించింది అంత‌క‌న్నా లేదు.

బాబు చేస్తున్న త‌ప్పుల్ని ప్ర‌శ్నించాలంటూ అడిగిన వారికి స‌ర్ది చెప్పిన ప‌వ‌న్‌.. ఈ రోజు మాత్రం నిల‌దీయాల‌ని.. గ్రామాల్లోకి రానివ్వ‌కూడ‌దంటూ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు చూస్తే.. కేసీఆర్ పంథాలోకి ప‌వ‌న్ వెళుతున్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. కేసీఆర్ మాట‌ల్ని ప‌వ‌న్ వాడుకోకూడ‌ద‌ని చెప్ప‌ట్లేదు కానీ.. ఆయ‌న మాదిరి మాట‌ల‌తో క‌న్వీన్స్ చేయ‌గ‌ల స‌త్తా ప‌వ‌న్ కు ఉందా? అన్న‌దే ప్ర‌శ్న‌. ఏది ఏమైనా.. ఎమ్మెల్యేల్ని గ్రామాల్లోకి రానివ్వ‌కుండా చూడాలంటూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఏపీ అధికార‌ప‌క్ష నేత‌ల‌కు షాకింగ్ గా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News