జగన్ రైతులకు ఇచ్చిన మాట మరిచినట్లున్నారు: పవన్

Update: 2020-02-18 16:55 GMT
ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బుల్ని 48 గంటల్లో ఇస్తామని చెప్పిన ఇచ్చిన జగన్ ప్రభుత్వం - వారాలు గడిచినా ఇవ్వడం లేదని - దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం రైతుల్ని నిలువునా మోసం చేసిందన్నారు.

పంటలు అమ్మి వారాలు గడుస్తున్నప్పటికీ వారికి డబ్బు చేతికి రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల సంక్షేమం - భరోసా అంటూ ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్ధానాలు చేసి - అధికారంలోకి వచ్చాక కనీసం బకాయిలు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇప్పటి వరకు రూ.2016 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.

ఇది రోజు రోజుకు పెరుగుతోందని, లక్షమందికి పైగా రైతులు రావాల్సిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రెండో పంట కోసం అవసరమైన పెట్టుబడికి చేతికి డబ్బులు రాకుండా రైతులు ఆందోళన చెందుతుంటే - సంబంధిత శాఖ మంత్రులు - అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన పంటకు చెందిన నిధులను రైతులకు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు.

రైతులు తమకు రావాల్సిన డబ్బుల గురించి అడిగితే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని - ఇది పాలకుల బాధ్యతారాహిత్యమన్నారు. కొనుగోలు చేసిన పంట డబ్బులు 48 గంటల్లో చెల్లిస్తామని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఆ మాటను మరిచినట్లుగా ఉన్నారని విమర్శించారు. ధాన్యం అమ్మి నెల రోజులు దాటినా డబ్బులు చేతికి రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని, రెండో పంటకు చేతిలో డబ్బులు లేకుండా పోతున్నాయన్నారు.

ఖరీఫ్ పంట కొనుగోలు - సొమ్ముల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ప్రణాళిక లేకుండా - ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో డిసెంబర్ నెలలోనే రైతు సౌభాగ్య దీక్ష ద్వారా వెల్లడించామన్నారు. ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా, లేదా చెప్పాలని నిలదీశారు. ఒకవేళ నిధులు కేటాయిస్తే ఆ నిధులు ఎటు వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించారు.


Tags:    

Similar News