పవన్ నోట కొత్త మాట...టీడీపీకి అర్ధం కావడంలా..!

Update: 2023-01-25 14:23 GMT
సినీ నటుడు కం పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ కొండగట్టులో చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు తావిస్తున్నాయి. అదే టైం లో పవన్ మాటల వెనక అర్ధాలు ప్రతిపదార్ధాలు వెతికే పనిలో తెలుగుదేశం ఉంది. అక్కడ పవన్ మాట్లాడుతూ చాలా కంఫ్యూజన్ కి తావిచ్చేలాగానే కామెంట్స్ చేశారు. పొత్తు ఉందా అంటే బీజేపీతో ఉంది. అందులో సందేహం ఎందుకు అని మీడియానే ఎదురు ప్రశ్నించారు.

అయితే కొత్త పొత్తులు కుదిరినా పెట్టుకుంటామని ఆయన చెప్పడం ద్వారా బీజేపీ ఆశలను కూడా అవిరి చేశారు. ఆ కొత్త పొత్తులు ఏంటి అంటే బీజేపీకి తెలిసిన జవాబు తెలుగుదేశం పార్టీతోనే అని అనుకుంటున్నారు. అయితే పవన్ తెలంగాణాలోనూ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. అంతే కాదు తాము గతంలో గ్రేటర్ ఎన్నికల్లో చేసినట్లుగా త్యాగాలు చేయమని చెప్పుకొచ్చారు. అంటే నాడు బీజేపీ కోసం జనసేన అభ్యర్ధులు పోటీ నుంచి తొలగిపోయారు.

కానీ ఈసారి అలాంటిది ఉండదని ఆయన అంటున్నారు. అదే సమయంలో ఏపీ వరకే బీజేపీ పొత్తు అన్నట్లుగా మాట్లాడారు. ఇక తెలంగాణాలో అసెంబ్లీలో తమకు అంటూ పది మంది ఎమ్మెల్యేలు అయినా ఉండాలి అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే బీయారెస్  ఏపీలో పోటీ చేయడాన్ని ఆయన స్వాగతించారు. అంటే బీయారెస్ పట్ల కొంత సానుకూల వైఖరి అయితే పవన్ కి ఉందా అన్న చర్చ కూడా వస్తోంది.

తెలంగాణాలో 2023లో చివరలో ఎన్నికలు జరుగుతాయి. అంటే అక్కడ పొత్తులు పెట్టుకుంటే అవి ఏపీలో కూడా ప్రభావం చూపుతాయి. తెలంగాణాలో బీజేపీతో పాటు తెలుగుదేశం కూడా ఉంది. కానీ పవన్ కొత్త పొత్తులు అన్న మాటలకు అర్ధాలు తెలియకనే ఇపుడు అంతా తలలు పట్టుకుంటున్నారు. అంటే పవన్ ఉదేశ్యం తెలంగాణాలో బీయారెస్ కి మద్దతు ఇచ్చి ఏపీలో ఆ పార్టీతో పొత్తులు పెట్తుకునే వ్యూహం ఉందా అని అంటున్నారు.

తెలంగాణాలో మున్నూరు కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. చాలా నియోజకవర్గాలలో వారు ప్రభావం చూపిస్తారు. అక్కడ జనసేనకు వారి అండ ఉంది. అది బీయారెస్ కి కావల్సి ఉంది. ఆ విధంగా చూసుకుంటే కేసీయార్ తో పొత్తుకు వెళ్ళి అక్కడ తమకు గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకుని ఏపీలో బీయారెస్ తో కలసి వెళ్లాలని ఆలోచన ఉందా అన్నదే తెలుగుదేశం పార్టీ ఇపుడు చర్చిస్తోందిట.

ఏపీలో కాపుల మీదనే బీయారెస్ గట్టిగా ఫోకస్ పెట్టింది. పైగా ఉభయ గోదావరి ఉత్తరాంధ్రా రాజకీయాల మీదనే ఆ పార్టీ చూపు సారించింది.  ఇవి జనసేనకు కూడా హాట్ పాకెట్స్ గా ఉన్నాయి. దాంతో ఓట్ల చీలిక నివారించేందుకు బలమైన బీయారెస్ తో పొత్తుకు జనసేన చూస్తోందా అన్నదైతే అనుమానంగా ఉందిట.

అదే కనుక జరిగితే మాత్రం ఏపీలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ పడుతుంది అని ఆ పార్టీలో చర్చిస్తున్నారు అని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు నిలువునా చీలిపోతుందని, దాంతో తమకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఇక పవన్ ఆలోచనల వెనక కూడా చాలా అర్ధాలు ఉన్నాయని తెలివైన వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీతో పొత్తుతో వెళ్తే కచ్చితంగా సీఎం క్యాండిడేట్ పవన్ అయినా ఆ పార్టీకి ఓట్లు లేవు. పైగా తనకు అది గుదిబండ అవుతుంది. దాంతో ఆ పొత్తు మీద అలా కాలు చేయి ఉంచుతూనే కొత్తగా వేరే ఆలోచనలు చేస్తున్నారు అంటున్నారు.

అలా చేసిన వాటిలో నిన్నటిదాకా మరో ఆప్షన్ గా తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ పార్టీతో జట్టు కడితే సీట్లూ ఓట్లూ వస్తాయి కానీ సీఎం సీటు మాత్రం దక్కదు. ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు, ఆయన వారసుడు లోకేష్ బాబు. దాంతో ఇపుడు ఏపీలో ఎంట్రీ ఇస్తున్న బీయారెస్ తో జట్టు కడితే సీఎం సీటు విషయంలో కచ్చితంగా గ్యారంటీ ఉంటుంది, అదే టైం లో అంగబలం, అర్ధబలం విషయంలో బీయారెస్ కేసీయార్ యమ దూకుడుగా ఉంటారు.

ఆయనతో కలసి  వెళ్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు జగన్ కి చెక్ పెట్టవచ్చు. ఇటు చంద్రబాబు కూడా ఏమీ అనలేని సీన్ ఉంటుంది. పైగా ఏపీ రాజకీయాల్లో బీజేపీని కేసీయార్ చీల్చిచెండాడుతారు. బీజేపీ ఏపీకి ఏమీ చేయలేదు అన్నది జనాలలో ఉంది. దానిని గట్టిగా పట్టుకుంటే ఓటింగ్ మొత్తం టర్న్ అవుతుంది. పైగా కాపులకు సీఎం అని కేసీయార్ చెబుతారు. ఆయనకు ఏపీలో సీఎం సీటు మీద ఆసక్తి ఉండదు. ఈ రకమైన ఆలోచనలతోనే పవన్ కొత్త పొత్తులు అన్న మాటను వాడారా అని టీడీపీలో చర్చ సాగుతోంది. ఏది ఏమైనా తెలుగుదేశం మాత్రం బాగా అలెర్ట్ అయింది అనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News