పవన్ కోసం వచ్చారు..జనసేన కోసం కాదు

Update: 2018-01-23 04:11 GMT
కొండగట్టు నుంచి తెలంగాణ యాత్ర మొదలుపెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు తొలిరోజే తత్వం బోధపడింది. కొండగట్టుకు ఆయన చేరుకోగానే భారీ సంఖ్యలో జనం అక్కడకు రావడంతో పవన్ తొలుత తెగ సంబరపడ్డారు. ఆయనే కాదు... ఆయన రాకతో ఏదో కొత్త ఊపు వచ్చేస్తుందని భావించినవారూ సంతోషించారు. అయితే.. ఆ ఆనందాలు ఎంతోసేపు నిలవలేదు. పవన్‌ ను చూడడానికి భారీ సంఖ్యలో వచ్చిన జనాలు ఆయన మైకందుకుని రాజకీయాలు మాట్లాడేసరికి మాయమైపోయారు. రెండు రాష్ర్టాల్లోని పాలక పార్టీలకు వ్యతిరేకంగా ఆయన ఏమీ మాట్లాడే పరిస్థితి కనిపించకపోయేసరికి జనం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
    
ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని చెప్పిన పవన్ ఆ పని మాని ప్రతిపక్షాలకు సుద్దులు చెప్పడం మొదలు పెట్టేసరికి అభిమానులు కూడా విసుగుచెందారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలంటూ ఆయన కాంగ్రెస్ - వైసీపీలనుద్దేశించి నీతులు చెప్పడాన్ని తెలంగాణ ప్రజలు తట్టుకోలేకపోయారు. తమ కష్టాలు వింటాడని భావించిన ప్రజలు తీవ్ర నిరాశ చెందారు.
    
పవన్ తన యాత్ర లక్ష్యాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని - సీఎం కేసీఆర్ ను పొగడడం మొదలుపెట్టారు. అంతేకాదు, తన పార్టీ పోటీలో ఉంటుందని ఆయన చెప్పినప్పటికీ ఎన్ని స్థానాలు - ఎక్కడెక్కడ అనే విషయాల్లో ఆయనలో ప్రాథమిక స్థాయి స్పష్టత కూడా కనిపించకపోవడంతో ప్రజలు నిరాశచెందారు. ఏదో చెప్తాడని ఆశించి వచ్చినవారంతా ఆయనలోని అయోమయం - పాలక పార్టీకి గులాం అనే ధోరణి చూసి అక్కడి నుంచి వెనుదిరగడం మొదలుపెట్టారు. దీంతో పవన్ యాత్ర తొలి రోజు దాదాపు తుస్సుమందనే చెప్పాలి. వచ్చినవారు కూడా సినీహీరో పవన్‌ ను చూడ్డానికి వచ్చినట్లుగా ఉందే తప్ప జనసేన అనే రాజకీయ పార్టీ కోసం వచ్చినట్లుగాలేదన్న మాట స్థానిక రాజకీయ వర్గాల నుంచి వినిపించింది.
Tags:    

Similar News