టీజెఎస్ కు పవన్ ప్రచారం!?

Update: 2018-10-24 15:51 GMT
తెలంగాణలో ఎన్నికల హోరు జోరుగా ఉంది. ముందస్తుతో పాటు అభ్యర్ధులను ప్రకటించిన తన జోరు.... హోరు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.అయితే ఆయన ఎత్తులకు పై ఎత్తులుగా అన్నట్లు తెలంగాణలో మిగిలిన ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కోవాలని నిర్ణయించాయి. మహాకూటమిలో పొత్తులు ఇంకా కుదరలేదు కాని.... ఒకటి రెండు రోజుల్లో అన్ని పక్షాల ఏకాభిప్రాయంతో సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ - తెలుగుదేశం - సిపిఐ పార్టీల అధిష్టానాలు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పొత్తులు చేసుకోవాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు సైతం త్యాగాలకు సిద్ధమై ఎలాగైనా తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దింపాలని పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు తెలంగాణ జన సమితికి కూడా గౌరవ ప్రదమైన స్ధానాలు ఇవ్వాలని మహాకూటమిలో నిర్ణయించుకున్నారు. దీంతో ఆ పార్టీ ఈ ఎన్నికలలో కనీసం 10 స్ధానాల్లో పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి అభ్యర్ధుల తరఫున ప్రచారం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ను కోరాలని తెలంగాణ జన సమితి నాయకుడు ప్రొఫెసర్ కోదండరాంకు ఆ పార్టీ నాయకులు సూచించినట్లు చెబుతున్నారు. మహాకూటమిలోని ఇతర పార్టీల జోలికి పోకుండా కేవలం తెలంగాణ  జన సమితికి మాత్రమే ప్రచారం చేయాలని కోరితే పవన్ కల్యాణ్ అంగీకరించే అవకాశం ఉందంటున్నారు. పవన్ కల్యాణ్ తన ప్రచారంలో మహాకూటమి గురించి ఏమాత్రం ప్రస్తావించకుండా కేవలం తెలంగాణ జన సమితి అభ్యర్ధుల విజయం కోసం ఆయన పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెజస నాయకుల భావనగా చెబుతున్నారు. కోదండరాం పట్ల, ఆయన ఉద్యమం పట్ల పవన్ కల్యాణ్ కు మంచి అభిప్రాయం ఉందని - దీనిని తమకు అనుకూలంగా వినియోగించుకోవాలన్నది తెలంగాణ జన సమితి ఆలోచనగా చెబుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్ర సమితిని విమర్శించే అవకాశాలు లేవు కాబట్టి కేవలం తెలంగాణ జన సమితి గురించి ప్రస్తావిస్తే సరిపోతుందని, ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ చెప్పి ఒప్పించాలని తెలంగాణ జన సమితి నాయకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే పవన్ కల్యాణ్ ప్రచారం ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు కూడా అర్ధం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News