సీమ నీటి క‌ష్టాల‌పై ప్ర‌ధానిని క‌ల‌వ‌నున్న ప‌వ‌న్!

Update: 2018-02-03 14:03 GMT
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా త‌న రాజ‌కీయ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్న‌సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ విడ‌త‌ల‌వారీగా రెండు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కొండ‌గ‌ట్టు నుంచి త‌న నాలుగురోజుల తెలంగాణ యాత్ర‌ను ప్రారంభించారు ప‌వ‌న్. ఆ త‌ర్వాత మ‌రో 4 రోజుల‌పాటు రాయలసీమలో ప‌ర్య‌టించి ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ నేప‌థ్యంలో కరీంనగర్, కొత్తగూడెం - ఖమ్మం - అనంతపురం జిల్లాల్లో పవన్ పర్యటనను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ కృతఙ్ఞతలు తెలుపుతూ జ‌న‌సేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ పర్యటనలో భాగంగా పవన్ దృష్టికి అనేక సమస్యలు వచ్చాయని పేర్కొంది.

రాయ‌ల‌సీమ‌లోని అనంతపురం జిల్లాలో చాలా కాలంగా క‌రువుకాట‌కాల‌తో కొట్టుమిట్టాడుతోన్న సంగతి తెలిసిందే.  ఆ ప్రాంతంలో నీటి ఎద్ద‌డి వ‌ల్ల వ్య‌వ‌సాయాన్ని న‌మ్ముకున్న రైతులు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. ముఖ్యంగా అనంత‌పురం ప్రాంతాల‌లోని  కరవునకు గ‌ల కారణాలను ప్రజాప్రతినిధులు రైతులు, మేధావులను పవన్ అడిగి తెలుసుకున్నార‌ని అ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఆ సమస్యలపై నిపుణులు, పార్టీ ముఖ్యులతో కలిసి విశ్లేషించే కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించారని పేర్కొంది. అనంతపురం నీటి కష్టాలపై చ‌లించిన పవన్ తన పర్యటనలో మాట ఇచ్చిన ప్ర‌కారం ఆ సమస్యను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తారని వెల్లడించింది. త్వ‌ర‌లో ప‌వ‌న్ మ‌రోవిడ‌త ప‌ర్య‌ట‌న జ‌ర‌ప‌బోతున్నార‌ని, తేదీలు ఖరారు కావాల్సి ఉందని తెలిపింది. ప‌వ‌న్ రెండో విడ‌త పర్యటన వివరాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
Tags:    

Similar News