ఆగ‌స్టులో భీమ‌వ‌రానికి ప‌వ‌న్‌.. ఎందుకంటే?

Update: 2019-07-30 04:40 GMT
ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌ర్వాత పార్టీ ప‌రంగా ప‌లు స‌మావేశాల్ని.. రివ్యూల్ని నిర్వ‌హించారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఆశించినంత జోరుగా పార్టీ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌న త‌న వ్యూహాన్ని కాస్త మార్చుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. సంస్థాగ‌తంగా పార్టీని బ‌ల‌ప‌ర్చేందుకు వీలుగా జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌కు ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని గుర్తించిన ప‌వ‌న్‌.. అందుకు భిన్నంగా తాను చురుగ్గా ఉండేలా కార్య‌క్ర‌మాల్ని ప్లాన్ చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

ఇందులో భాగంగా ఆగ‌స్టులో భీమ‌వ‌రం ప‌ర్య‌టించాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించిన‌ట్లుగా పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఆగ‌స్టు మొద‌టివారంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ‌వ‌రం ప‌ర్య‌టిస్తార‌ని.. పార్టీ కోసం ప‌ని చేసి ప్రాణాలు కోల్పోయిన అభిమాని కుటుంబాన్ని.. వారి కుటుంబ స‌భ్యుల్ని స్వ‌యంగా ప‌రామ‌ర్శిస్తార‌న్నారు.

ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత విజ‌య‌వాడ‌లో తొలిసారి పార్టీ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్.. ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు.. ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఇత‌ర క‌మిటీ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. స‌మావేశం ముగిసిన త‌ర్వాత ఆ వివ‌రాల్ని వెల్ల‌డించేందుకు మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు వీలుగా అంద‌రి సూచ‌న‌లు తీసుకున్నామ‌ని.. పార్టీని బ‌లోపేతం చేయ‌టానికి ప్ర‌తి నేత‌.. కార్య‌క‌ర్త ప‌ని చేయాల‌ని సూచించారు. నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం జ‌న‌సేన కృషి చేస్తుంద‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ వ్యాఖ్యానించారు.

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం అనంత‌రం.. తొలిసారి ప్ర‌జ‌ల్లోకి వెళ్లే కార్య‌క్ర‌మం భావోద్వేగాన్ని త‌ట్టి లేపేదిగా ఉంటే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో భీమ‌వ‌రం టూర్ ఎంచుకున్న‌ట్లు చెబుతున్నారు. పార్టీ కోసం ప‌ని చేసే వారికి గుర్తింపు.. పార్టీ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు అధినేత‌గా అండ‌గా ఉంటాన‌న్న సంకేతాన్ని ఇచ్చేందుకే ప‌వన్ తాజా టూర్ పెట్టుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వైపు ఎమోష‌న్.. మ‌రోవైపు మైలేజీ రెండింటికి అవ‌కాశంతో పాటు.. ఎక్క‌డ పోగొట్టుకున్నామో.. అక్క‌డే వెతుక్కోవాల‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ ఆచ‌ర‌ణ‌లో చూపిస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. తాను బ‌రిలోకి దిగి ఓడిన చోటే.. మ‌రింత పుంజుకోవాల‌న్న ఉద్దేశం ప‌వ‌న్ తాజా నిర్ణ‌యంలో క‌నిపిస్తోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Tags:    

Similar News