పవన్ అభిమానుల్లో ఆసంతృప్తి జ్వాలలు!

Update: 2018-04-04 17:36 GMT
‘కొంత మంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు’ అంటాడు ఓ సినీకవి. ఆ పాట లాగా ఉన్నది పవన్ కల్యాణ్ పరిస్థితి. కొత్తగా పుట్టిన పార్టీ. ప్రజల్లోకి దూసుకువెళ్లడానికి, ప్రజాదరణను త్వరగా సంపాదించుకోవడానికి, రాష్ట్రానికి సారథ్యం వహించగల సత్తా, పోరాట పటిమ తమకు పుష్కలంగా ఉన్నాయని నిరూపించుకోవడానికి తహ తహ లాడాల్సిన పార్టీ... ఇంతగా ఈసురోమంటూ.. ముసలి నిర్ణయాలు తీసుకుంటున్నదేమిటా.. అని పార్టీ కార్యకర్తలే.. ఆశ్చర్యపోతున్నారు. ఏమాత్రం దూకుడు ప్రదర్శించకుండా.. సెంచరీల కాలం నాటి ఉద్యమ ప్రణాళికలతో పవన్ కల్యాణ్ అసలు తాను ఏమైనా సాధించదలచుకుంటున్నారా? లేదా.. ఆటలో అరటిపండు లాగా.. ఏదో రాజకీయ నాయకుడు అనే ట్యాగ్ లైన్ తగిలించుకుంటే చాలునని అనుకుంటున్నారా..? అంటూ పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.

ఇవాళ విజయవాడలో వామపక్షాలతో, తన సొంత పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్ చిట్టచివరికి ఒక మార్నింగ్ వాక్ ఉద్యమాన్ని ప్రకటించారు. ఈ ‘మార్నింగ్ వాక్ ఉద్యమం’ 6వ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభం అవుతుంది. స్పీడుబ్రేకర్లు కూడా లేకుండా.. సాఫీగా ఉండే జాతీయ రహదార్ల మీద.. ఒక వారగా.. ట్రాఫిక్ కు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా.. జనసేన మరియు వామపక్షాల నాయకులు ‘మార్నింగ్ వాక్’ నిర్వహిస్తారన్నమాట. కనీసం ఎంత దూరం నడుస్తారో, ఎంత సేపు నడుస్తారో కూడా వారు చెప్పలేదు. ఆ తర్వాత ఎంచక్కా ఇళ్లకు వెళ్లి తొంగుంటారు.

ఈ మార్నింగ్ వాక్ తో రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చేస్తుందా? తమ నాయకుడు చెబుతున్నట్లుగా ఈ మార్నింగ్ వాక్ వలన పుట్టే వేడి ఢిల్లీని తాకుతుందా? అనేది ఇప్పుడు పవన్ అభిమానుల్లో మెదలుతున్న సందేహం. హీరోలాంటి తమ నాయకుడు పవన్ కల్యాణ్ కు ఇలాంటి ముసలి ఐడియాలు ఇస్తున్నది ఎవరా? అని అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కనీసం తమ హీరో ఆమరణ నిరాహార దీక్ష అయినా చేస్తాడేమో.. దానివలన రాష్ట్ర వ్యాప్తంగా ఒక  క్రేజ్ ఏర్పడుతుందని అనుకుంటూ ఉంటే.. ఇలాంటి నడక ఉద్యమాలతో.. కేంద్రాన్ని కదిలిస్తాం అని పవన్ చెవిలో ఊదుతున్నదెవరో అని అభిమానులు ఆగ్రహిస్తున్నారు. కనీసం అభిమానుల కోసం అయినా.. పవన్ ఇంకాస్త గట్టి పోరాటాలు చేయాలని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News