పెళ్లి పత్రిక మీద పవన్.. వారాహి ఫోటోలు.. ట్విస్టు ఏమంటే?

Update: 2023-06-04 09:18 GMT
అభిమానానికి హద్దులు ఉండవంటారు. అందునా జనసేనాని కమ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద అభిమానం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అలాంటి అభిమానాన్నే ప్రదర్శించాడు ఒక యువకుడు. అతగాడి పెళ్లి సందర్భంగా అచ్చు వేయించిన శుభలేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. పెళ్లి పత్రిక మొదటి పేజీలో పవన్ ఫోటోతో పాటు.. వారాహి ఫోటోను అచ్చేయించటం ద్వారా తన అభిమానాన్ని ప్రదర్శించాడు.

ఇంతకీ ఆ వీరాభిమాని ఎవరు? ఎక్కడి వాడు? అన్న వివరాల్లోకి వెళితే.. ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పార్వతీపురం మన్యం జిల్లా తెలిసిందే. ఇక్కడి జియ్యమ్మవలస మండలానికి చెందిన లచ్చిపతుల రంజిత్ కుమార్  అనే యువకుడికి పవన్ కల్యాణ్ అంటే వీరాభిమానం. జనసేన కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. కురుపాం నియోజకవర్గ ఐటీ వింగ్ కో ఆర్డినేటర్ గా పని చేస్తున్నాడు.

శనివారం అర్థరాత్రి అతడి పెళ్లి జరిగింది. తన పెళ్లికి అచ్చు వేయించిన శుభలేఖ మొదటి పేజీలో జనసేనాని పవన్ కల్యాణ్ ఫోటోను.. వారాహి ఫోటోను వేయించిన అతను రెండో పేజీలో జనసేన ఎన్నికల హామీల్ని వేయించారు. మూడో పేజీలో పెళ్లి పత్రికను యథాతధంగా అచ్చేయించాడు. అయితే.. ఈ మొత్తం పెళ్లి కార్డులో అసలు ట్విస్టు ఏమంటే.. ఎన్నికల హామీల వివరాల్ని వెల్లడించిన అతను.. కిందన గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల ప్రకారం జనసేనకు కేటాయించిన గాజు గ్లాసును ఓపెన్ కేటగిరిలోకి ఉంచేయటం ద్వారా.. ఆ గుర్తును ఎవరికైనా ఇచ్చేస్తారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తగా వ్యవహరించే రంజిత్ కుమార్.. గాజు గ్లాసుకు ఓటే వేయాలని కోరటం ఆసక్తికరంగా మారింది.

Similar News