ప‌వ‌న్ వెయిట్ చేశారా? వెయిట్ చేయించారా?

Update: 2018-01-02 07:16 GMT
కొత్త సంవ‌త్స‌రం వేళ ఎలాంటి రాజ‌కీయ సంచ‌ల‌నం లేకుండా సాఫీగా సాగుతుంద‌నుకున్న వేళ‌.. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో టీవీ ఛాన‌ళ్ల‌లో బ్రేకింగ్ న్యూస్ చూసిన కొంద‌రు ఆశ్చ‌ర్య‌పోయిన ప‌రిస్థితి. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను క‌లిసేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ కావ‌టం ఏమిట‌ని.
అయితే.. ఎవ‌రూ ఊహించ‌నిరీతిలో వ్య‌వ‌హ‌రించ‌టం ప‌వ‌న్ కు అల‌వాటు. త‌న‌కు అనిపిస్తే చాలు.. లేడికి లేచిందే ప‌రుగ‌న్న‌ట్లుగా ప‌వ‌న్ తీరు ఉంటుంది. ఆయ‌న్ను అడ్డుకునేవారు.. ఆయ‌న ఆలోచ‌న స‌రైన‌దేనా?  కాదా? అన్న విష‌యంలో చ‌ర్చ‌కు పెట్టేవారు.. స్పీడ్‌కు బ్రేకులు వేసేవారు ఎవ‌రూ ఉండ‌రు. చుట్టూ ఉన్న వారంతా స్వామి భ‌క్తులే త‌ప్పించి.. లాభ‌న‌ష్టాల్ని బేరీజు వేసి చెప్పే దూర‌దృష్టి ఉన్నోళ్లు కాదు. అందుకే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటోడు సీఎం కేసీఆర్‌ను క‌లిసేందుకు వెళితే గంట పాటు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది.

కేసీఆర్ కోసం ప‌వ‌న్ వెయిటింగ్ మీద సోష‌ల్ మీడియాలో భారీగానే పంచ్ లు ప‌డుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఒక ఆస‌క్తిక‌ర పోస్ట్ క‌నిపించింది. అదేమంటే.. ప‌వ‌న్ కోసం బాబు వెయిట్ చేస్తే.. కేసీఆర్ కోసం ప‌వ‌న్ వెయిట్ చేయాల్సి వ‌చ్చింద‌న్న‌ది. ఈ పోస్టు మోతాదు మించిన‌ట్లు క‌నిపించినా.. త‌ర‌చి చూస్తే వాస్త‌వం అదే క‌దా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

కేసీఆర్.. ప‌వ‌న్ భేటీలో వారేం మాట్లాడుకున్నార‌న్న వార్త కంటే కూడా.. కేసీఆర్ కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ గంట‌సేపు వెయిట్ చేశార‌న్న‌దే హైలెట్ కావ‌టం గ‌మ‌నార్హం. ఒక ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త ప్ర‌కార‌మైతే.. ప‌వ‌న్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చిన విష‌యాన్ని అప్ప‌టికే రాజ్ భ‌వ‌న్ లో ఉన్న కేసీఆర్ చెవిన వేస్తే.. ఆయ‌న్ను త‌న ఇంట్లోకి తీసుకెళ్ల‌మ‌ని చెప్పిన‌ట్లుగా వ‌చ్చింది. ఇంటికి అతిధి వ‌చ్చాడ‌ని తెలిసిన‌ప్పుడు.. ఇంట్లో వెయిట్ చేస్తున్నాడ‌ని తెలిసిన‌ప్పుడు వెను వెంట‌నే వెళ్లిపోతారు. కానీ.. కేసీఆర్ కోసం మాత్రం ప‌వ‌న్ గంట‌పాటు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది.

ఇంత‌కీ.. ప‌వ‌న్ వెయిట్ చేశాడా?  కేసీఆర్ వెయిట్ చేయించారా? అన్న ప్ర‌శ్న వేసుకొని.. జ‌రిగిన ప‌రిణామాల్ని జాగ్ర‌త్త‌గా చూస్తే ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి. మీకు బాగా తెలిసిన వ్య‌క్తి ఇంటికి వెళ్లార‌నుకుందాం. మీది.. అత‌నిది ఇంచుమించు ఒకేస్థాయి అనుకుందాం.  వాస్త‌వానికి మీరో తోపు అయిన‌ప్ప‌టికీ  ప్రోటోకాల్ ప్ర‌కారం మీరు ఇంటికి వెళ్లిన వ్య‌క్తి పైస్థాయిలో ఉన్నార‌నుకుందాం. న్యూఇయ‌ర్ విషెస్ చెప్పేందుకు వెళితే.. ఎంత‌సేపు మాట్లాడ‌తారు? అంటే.. దానికి  ఇష్టం వ‌చ్చినంత‌సేపు అన్న స‌మాధానం వ‌స్తుంది.

ఇదిలా ఉంటే.. విషెస్ చెప్పే హ‌డావుడిలో మీరు ఉన్న‌ప్పుడు.. మీ ఇంటికి ప‌క్క వీధికి చెందిన పోటుగాడు వ‌చ్చాడ‌న్న విష‌యం తెలిసింద‌నుకోండి.. మీరేం చేస్తారు?  వాస్త‌వానికి మీకు.. ప‌క్క బ‌జారు పోటుగాడికి మ‌ధ్య అంత పెద్ద రిలేష‌న్ లేకున్నా.. విషెస్ చెప్ప‌టానికి వ‌చ్చాడ‌న్న విష‌యం తెలిస్తే ఏం చేస్తాం?

ఆరే.. ముందే చెబితే బాగుండేది క‌దా.. అత‌గాడు వ‌చ్చే టైంకి ఇంట్లో ఉండేవాళ్లం క‌దా అని అనుకుంటాం. ఒక‌వేళ ప‌క్కాగా ఫ‌లానా టైంకి క‌లుద్దామ‌ని అనుకోకుంటే.. అరేరె.. మ‌నం లేన‌ప్పుడు ఇంటికి వ‌చ్చాడే.. కాస్త జాగ్ర‌త్త‌గా చూసుకోండి. ఇంటికి వెంట‌నే వ‌స్తున్నా అని చెబుతాం. తాను విషెస్ చెప్పేందుకు వెళ్లిన పెద్ద మ‌నిషికి సైతం.. ఇంటికి అనుకోకుండా అతిధి వ‌చ్చాడు.. మ‌ళ్లీ వ‌స్తా.. ఈసారి నిదానంగా కాసేపు కూర్చొని మాట్లాడుకుందామ‌ని చెప్పి.. హ‌డావుడిగా వ‌చ్చేస్తాం. ఇది ఎక్క‌డైనా.. ఎవ‌రి విష‌యంలో అయినా జ‌రుగుతుంది?

ఈ లెక్క‌న చూసిన‌ప్పుడు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసేందుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఇంటికి వ‌చ్చిన‌ట్లు తెలిసిన‌ప్పుడు ఇంట్లోకి తీసుకెళ్ల‌మ‌న‌టం వ‌ర‌కు ఓకే. కానీ.. గ‌వ‌ర్న‌ర్ నివాసం నుంచి త‌న నివాసానికి చేరుకోవ‌టానికి.. మొత్తంగా గంట సేపు వెయిట్ చేయాల్సి రావ‌టం ఏంటి? ఇప్పుడు మీరే చెప్పండి..?  కేసీఆర్ కోసం ప‌వ‌న్ వెయిట్ చేశారా? ప‌వ‌న్ ను కేసీఆర్ వెయిట్ చేయించారా?


Tags:    

Similar News