ప‌వ‌న్ అతి మంచిత‌న‌మే జ‌న‌సేన‌లో ఇష్టారాజ్యం?

Update: 2019-03-05 06:24 GMT
అధినేత అంటే ఇష్టం ఎంత ముఖ్య‌మో.. అంత‌కు మించిన భ‌యం.. భ‌క్తి ఉండాలి. పార్టీ ఏదైనా కానీ అధినేత అంటే అభిమానం ఉన్న నేత‌ల కంటే.. భ‌యం.. భ‌క్తితో గ‌డ‌గ‌డ‌లాడే వారే ఎక్కువ‌గా ఉంటారు. అంతేనా.. త‌మ చుట్టూ ఉన్న నాయ‌కుల‌కు అవ‌సరానికి త‌గ్గ‌ట్లు చుక్క‌లు చూపించే అధినేత‌కు ఇచ్చే మ‌ర్యాద‌.. మంచిగా.. క‌లివిడిగా ఉండే వారికి ఇవ్వ‌ర‌న్న పేరుంది. ఎవ‌రిదాకానో ఎందుకు? జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ విష‌యానికే వ‌ద్దాం. 

ఆయ‌న్ను వ్య‌క్తిగ‌తంగా క‌లిసివారు.. ప‌రిచ‌యం ఉన్న వారు ఒక్క విమ‌ర్శ చేయ‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు. అంత మంచిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెబుతారు. అలాంటి ఆయ‌న మంచిత‌నం ఇప్పుడు జ‌న‌సేన‌లో ఆరాచ‌కంగా మారిందంటున్నారు. ఎవ‌రికి వారు తామే జ‌న‌సేన అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించుకోవ‌టం.. టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొన‌టం.. సామాజిక మాధ్య‌మాల ద్వారా వ్యాఖ్య‌లు చేయ‌టం.. ప‌వ‌న్ ఇమేజ్ ను ప్ర‌భావితం చేసేలా చేస్తున్న ప‌రిస్థితి.

దీంతో..  ప‌వ‌న్ తెగ ఇబ్బంది ప‌డిపోతున్నారు. స‌రైన ప్ర‌ణాళిక లేక‌పోవ‌టం.. ప‌వ‌న్ చుట్టూ ఉన్న వారి స‌మ‌ర్థ‌త మీద కూడా చాలానే సందేహాలున్న ప‌రిస్థితి. అన్నింటికి మించి ప‌వ‌న్ కు అన్ని విషయాల మీద అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉండ‌ట‌మే కాదు.. నిర్ణ‌యాల్ని తీసుకునే అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన వారి తీరు కూడా కొన్ని స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.

దీనికి తోడు ప‌వ‌న్ మంచిత‌న‌మే తెలిసిన వారు.. ఆయ‌న మంచిత‌నాన్ని అమాయ‌క‌త్వంగా వాడేయ‌టం.. ఆయ‌న పేరుతో చేస్తున్న ప‌నుల కార‌ణంగా ప‌వ‌న్ ఇమేజ్ భారీగా ప్ర‌భావితం అవుతున్న దుస్థితి. ఇలాంటివి కొన్ని త‌న దృష్టికి వ‌చ్చినా చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో నాన్చే ధోర‌ణి కార‌ణంగా జ‌న‌సేన‌లోని కొంద‌రునేత‌లు అలుసుగా తీసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ కొంద‌రు నేత‌లు ఒక అడుగు ముందుకేసి తాము ఫ‌లానా నియోజ‌క‌వ‌ర్గానికి జ‌న‌సేన అభ్య‌ర్థిగా పేర్కొంటూ టీవీల్లోకి.. మీడియాలోకి.. సోష‌ల్ మీడియాలోకి చొచ్చుకుపోతున్నారు. వీరి కార‌ణంగా జ‌న‌సేన త‌ర‌చూ బ‌ద్నాం అవుతోంది. ఈ విష‌యంపై తాజాగా ప‌వ‌న్ సీరియ‌స్ గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఆయ‌న స‌న్నిహితులు కొంద‌రు.. జ‌న‌సేన‌లో పెరుగుతున్న ఇష్టారాజ్యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లార‌ని.. దీంతో మేల్కొన్న ఆయ‌న ఈ వ్య‌వ‌హారంపై సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా జ‌రిగిన ఒంగోలు స‌భ‌లో ఒక వార్నింగ్ ఇచ్చేశారు ప‌వ‌న్‌. అయితే.. ఈ వార్నింగ్ ప్ర‌త్య‌ర్థుల‌కు కాదు త‌న పార్టీలోని సొంత వ్య‌క్తుల‌పైనే చేయ‌టం గ‌మ‌నార్హం. ఆయ‌నేమ‌న్నారంటే.. "నాకు పార్టీలో ఎవరూ ఎక్కువకాదు - ఎవరూ తక్కువకాదు. ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది జనసైనికులం అని చెప్పుకొని చేస్తున్న పనులు నాకు నచ్చలేదు. ఒకరిద్దరు బయట టీవీల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఫేస్ బుక్స్ లో ఏవేవో పెడుతున్నారు. ఇది నాకు నచ్చలేదు. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు ఎమ్మెల్యేలుగా ప్రకటించుకుంటే, వెంటనే పార్టీ నుంచి బయటకు పంపించేస్తాను. నాకు అలాంటి భయాలులేవు. కొద్దిమంది తమ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. నేను చాలా నిర్దాక్షిణ్యమైన వ్యక్తిని. బయటకు పంపించేస్తాను ఖబడ్దార్"  అని మండిప‌డ్డారు. మాట‌లు కాదు ప‌వ‌న్.. చేత‌ల్లో చూపిస్తే కానీ విష‌యం ఒక కొలిక్కి రాదు. లేకుంటే.. కిందా మీదా ప‌డాల్సిందే.
Tags:    

Similar News