పవన్ చెప్పింది పొత్తులతో వైసీపీ చిత్తు చేస్తామనేనట‌

Update: 2022-09-19 10:30 GMT
పవన్ కళ్యాణ్ సినిమా నటుడు గా ఉంటున్నా ఏపీ రాజకీయాలను బాగా ఔపాసన పట్టారు. ఆయన ఒక విధంగా చెప్పాలీ అంటే బాగానే  రాటుదేలిపోయారు. అందుకే పవన్ మాటల వెనక అసలు అర్ధాలను అర్ధం చేసుకోవడం ఒక్కోసారి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయనకు ఏమీ తెలియదు అని లైట్ తీసుకుంటే ప్రత్యర్ధి వర్గం ఇబ్బందిపడడం ఖాయమే అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కనిష్టంగా 45 సీట్ల నుంచి గరిష్టంగా 67 దాకా సీట్లు వస్తాయని  పవన్ తాజాగా జోస్యం చెప్పారు. దీన్ని మాజీ మంత్రి పేర్ని నాని కొట్టిపారేశారు. ఇంతకీ జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి అసలు ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది అని కూడా నిలదీశారు. చిలక జోస్యాలు చెప్పకండి అని కసురుకున్నారు. అయితే ఈ విషయం మీద కాస్తా లోతుగా ఆలోచిస్తే పవన్ చెప్పినది వైసీపీ మీద జోస్యం కాదు ఏకంగా ఆ పార్టీ జాతకాన్నే బయటపెట్టారు అని అంటున్నారు.

ముఖ్యంగా ఇక్కడ పవన్ చెప్పిన నంబర్ తీసుకుంటే వైసీపీకి 2014 నాటి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకురాక మానదు. అప్పట్లో కూడా వైసీపీకి 67 సీట్లు వచ్చి విపక్షంలో చేరింది. దానికి కారణం 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన, బీజేపీ కలసి పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో చూస్తే పొత్తులు లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేశాయి.

దాంతో వైసీపీకి 151 సీట్లు దక్కాయి. కానీ 2024 నాటికి పాత మ్యాజిక్ ని రిపీట్ చేసి వైసీపీకి ఘోర పరాభవం రుచి చూపించాలని పవన్ ఉవ్విళ్ళూరుతున్నారు. దాంతో ఆయన పొత్తుల వైపే అడుగులు వేస్తున్నారు అని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. దానికి సంకేతాలు ఇస్తున్నట్లుగానే పవన్ మంగళగిరిలొని తన పార్టీ ఆఫీస్ లో వైసీపీ ఫ్యూచర్ గురించి ఈ హాట్ కామెంట్స్ చేశారు అని అంటున్నారు.

ఆయన చెప్పిన లెక్కలు తీసుకుంటే టీడీపీ జనసేన, బీజేపీ  కలసి పోటీ చేస్తే కచ్చితంగా వైసీపీ విపక్షం బాట పట్టడం ఖాయమని అంటున్నారు. ఈ విధంగా పరోక్షంగా పవన్ తాను పొత్తు రూట్ లో ఉన్నాను అని చెప్పుకున్నారు అన్న మాట. అదే టైం లో తమ మూడు పార్టీలు కలిస్తే వైసీపీకి చుక్కలే అని కూడా లెక్క తీసి చెప్పారు. దీని మీదనే ఆయన చేయించుకున్న సర్వేలలో ఈ ఫలితాలు వచ్చాయని చెప్పకనే చెప్పారన్న మాట.

నిజానికి ఏపీలో రాజకీయం చూసుకున్నా అలాగే ఉంది. జనసేన గేమ్ చేంజర్ గా ఉంది. ఆ పార్టీ కనుక విడిగా పోటీ చేస్తే టీడీపీ ఓడి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. అదే జనసేన సైకిలెక్కితే కచ్చితంగా జగన్ విపక్ష నేత అవుతారు. ఇక ఈ మధ్య వచ్చిన పలు జాతీయ సర్వేలు కూడా వైసీపీదే ఏపీలో విజయం అని చెప్పాయి. 18 ఎంపీ సీట్లకు తగ్గకుండా ఆ పార్టీ కైవశం చేసుకుంటుంది అని కూడా పేర్కొన్నాయి.

అదే విధంగా ఆ సీట్లను ఎమ్మెల్యే సీట్లకు కన్వర్ట్ చేసుకుంటే 140 దాకా వైసీపీకి సీట్లు వస్తాయన్న మాట. ఇక వైసీపీ చేయిస్తున్న పలు సర్వేలు కానీ ఇతరత్రా సర్వేలు కానీ ఈసారి ఆ పార్టీకి సీట్లు తగ్గుతాయనే చెబుతోంది. కానీ అధికారం ఖాయమని కూడా అంటోంది. ఇవన్నీ కూడా ఏపీలో జనసేన టీడీపీ బీజేపీ విడిగా పోటీ చేసిన పక్షంలో వచ్చే ఫలితాలు. అంటే విడిగా ఈ పార్టీలు బరిలోకి దిగినా కూడా వైసీపీ సీట్లు పెద్ద ఎత్తున తగ్గుతాయని ఆ సర్వేలే చెబుతున్నాయి.

అలాంటిది మూడు పార్టీలు కట్టకట్టుకుని వస్తే వైసీపీ పొజిషన్ మారి అపొజిషన్ లోకి వెళ్తుంది అని అంటున్నారు. సో ఈ విషయాన్నే పవన్ వైసీపీ వారికి సుతిమెత్తగా చెబుతూ హెచ్చరించారన్న మాట. ఆరు నూరు అయినా ఏపీలో టీడీపీ జనసేన పొత్తు కుదురుతుంది అని అంతా అంటున్నారు. ఇక బీజేపీ విషయమే చూడాలి. ఇపుడు తేల్చకపోయినా ఎన్నికల వేళకు బీజేపీ కూడా ఈ కూటమిలో చేరుతుంది అంటున్నారు.

మొత్తానికి చూసుకుంటే వైసీపీలోనూ ఈ పొత్తులు వాటి పర్యవశానాల గురించి చర్చ అయితే గట్టిగానే  సాగుతోంది. బీజేపీ వైఖరి పూర్తిగా తేలిన తరువాత వైసీపీ రాజకీయ వ్యూహం బాహాటం అవుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ మాత్రం ఈ లెక్కలు ఊరకే చెప్పలేదు సుమా అని అధికార పార్టీలో కూడా చర్చ నడుస్తోందిట ఇపుడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News