వీకెండ్ పాలిటిక్స్ : పేర్ని నానికి డ్యూటీ వేస్తున్న పవన్

Update: 2022-09-18 16:30 GMT
పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. తన రాజకీయమేదో తాను చేసుకుంటున్నారు. ఆయన వీకెండ్ పొలిటీషినా లేక మరోటా అన్నది జనం తేల్చుకుంటారు. ఆయన ఏపీకి వచ్చి మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకుంటారు. ఆయన వైసీపీ మీద జగన్ మీద సహజంగానే విమర్శలు చేస్తారు. అది ఆయన రాజకీయ సిద్ధాంతం అని సరిపెట్టుకోవచ్చు.

అయితే వీకెండ్ పొలిటీషియన్ గా పవన్ని పేర్కొంటున్న మాజీ మంత్రి, పేర్ని నాని కూడా వీకెండ్ ప్రెస్ మీట్ల లీడర్ గా పూర్తి స్థాయిలో మారిపోతున్నారన్నదే ఒక తమాషా.  పాపం ఆదివారం. సెలవు రోజు.  అంతా స్తబ్దుగా ఉన్న వేళ అధికార పార్టీ రాజకీయం కూడా పెద్దగా హడావుడి చేయని వేళ సండే డ్యూటీలు పేర్ని నానికి  వరసబెట్టి పడిపోతున్నాయి. అది కూడా పవన్ కళ్యాణ్ వల్లనే మరి.

పవన్ వీలు చూసుకుని ఆదివారం ఏపీకి వస్తూంటే ఆయన తో పాటే జనసేన వారు ఎంత మేర రెడీ అవుతారో తెలియదు కానీ కౌంటర్లేయడానికి మాత్రం పేర్ని నాని వారు రెడీగా ఉండాల్సిందే. పవన్ ఉదయమంతా తన ఆఫీస్ లో మీటింగ్ పెడితే ఆ పాయింట్లు పట్టుకుని సాయంత్రం వైసీపీ ఆఫీస్ లో పేర్ని నాని మీడియా మీటింగ్ ఠంచనుగా పెట్టాల్సిందే. అప్పటికపుడే ఆ వేడి చల్లారకముందే  పవ‌న్ ద్వారా పుచ్చేసుకున్నవి తిరిగి ఇచ్చేసుకోవడమే.

ఇలా పవన్ కోసం నాని డ్యూటీ చేస్తున్నారు. మరి ఈ డ్యూటీ వైసీపీ హై కమాండ్ ఆయనకు అప్పగించిందో లేక తానే వైసీపీ తరఫున పవన్ని ఢీ కొట్టే మొనగాడుగా ఆయన ముందుకు వస్తున్నారో తెలియదు కానీ ఎంతో రాజకీయ అనుభవం కలిగి మంత్రిగా కూడా పనిచేసిన పేర్ని నాని మాత్రం పవన్ని కౌంటర్ చేయడానికే పరిమితం కావడం మాత్రం చిత్రంగానే తోస్తోంది అంటున్నారు.

పాయింట్ టూ పాయింట్ అన్నట్లుగా పవన్ ఏమి అంటే దానికి రివర్స్ అటాక్ చేస్తూ పేర్ని నాని ఏమి సాధించారో కానీ ఆయన మాత్రం పవన్ ఏపీకి వస్తున్నారు అంటే తన సమస్త పనులు మానేసుకుని కౌంటరేయడానికి డ్యూటీ ఎక్కాల్సిందే అంటున్నారు. పవన్ని విమర్శిస్తే వైసీపీలో ఆయనకు మైలేజ్ పెరుగుతుందో లేక వైసీపీకి పొలిటికల్ గా మైలేజ్ వస్తుందో ఏమో తెలియదు కానీ పవన్ చేసిన ప్రసంగాలను వినని వారికి చూడని వారికి ఈ విధంగా మరోమారు నాని ఆ సినిమా చూపిస్తూ ఆఖరుకు జనసేనానికి మరింత పబ్లిసిటీ కల్పిస్తున్నారా అన్న చర్చ అయితే ఉంది మరి.
Tags:    

Similar News