పవన్ నోటి వెంట ఆ ఒక్క మాట...?

Update: 2022-11-13 14:44 GMT
జనసేనాని పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తు మీద స్పష్టంగా ఉన్నారా. ఆయన ఒక కచ్చితమైన ఆలోచనతో ముందుకు సాగుతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇప్పటిదాకా పొత్తుల గురించి అటూ ఇటూ పార్టీలకు చెందిన పెద్దలతో కరచాలనం చేస్తూ వచ్చిన పవన్ లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం సంచలనంగానే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలోని గుంకలాంలో నిర్మిస్తున్న జగనన్న ఇళ్లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కీలకమైన కామెంట్స్ చేశారు. తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూపిస్తాను అని పవన్ ప్రజలకు వినతి చేయడం చర్చనీయాంశం అయింది. రాజకీయాల్లో అవినీతిని పారదోలి యువతకు అవకాశం ఇస్తామని, అలాగే మార్పునకు తమ పార్టీ కృషి చెస్తుందని ఆయన చెప్పుకున్నారు.

తనను నమ్మండి నా మీద విశ్వాసం ఉంచండి  అంటూ పవన్ జనాలను ఉద్దేశించి విన్నవించుకున్నారు. తనకు జనాల నుంచి మద్దతు ఉంటే కనుక గూండాలతో పోరాడుతాను అని ఆయన చెప్పడం విశేషం. మరి పవన్ ఈ విధంగా చెబుతున్నారు అంటే ఆయన ఒంటరిగా పోటీకి సిద్ధపడుతున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఇప్పటికి రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని కలసివచ్చారు. దాంతో బీజేపీతో కలసి జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అనుకున్నారు.

అది జరిగిన తరువాత మీడియా ముందు పెద్దగా ఏమీ మాట్లాడని పవన్ ఇపుడు విజయనగరం జిల్లా టూర్ లో తనను నమ్మాలని, జనసేనకు అధికారం ఇవ్వాలని కోరడం ద్వారా బీజేపీని పక్కన పెట్టేశారా అన్న చర్చ మళ్లీ వస్తోంది. ప్రధానితో పవన్ జరిపిన చర్చలు ఏమిటి అని ఒక వైపు బుర్రలు బద్ధలు కొట్టుకుంటూ ఎవరికి వారుగా విశ్లేషణలు చేసుకుంటున్న నేపధ్యంలో పవన్ ఇపుడు ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం చూస్తూంటే ఆయన బీజేపీతో కలసి ప్రయాణం చేయడంలేదా అన్న డౌట్లు వస్తున్నాయి.

ఇక జనసేన బీజేపీ కలసి పోటీ చేస్తాయని ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యనే పొత్తు ఉంటుందని బీజేపీ వైపు నేతలు ఈ రోజుకూ ప్రకటించుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ జనసేన నేతలు మాత్రం ఇప్పటికి కూడా ఆ విషయం మీద మాట్లాడడంలేదు. బీజేపీ అన్న మాట అయితే జనసేన నాయకుల  నోటి నుంచి అసలు రావడంలేదు. ఇపుడు చూస్తే పవన్ కళ్యాణ్ జనసేనకే పట్టం కట్టమని చెబుతున్నారు అంటే ఆలోచించాల్సిందే.

అంటే ఏపీ రాజకీయాల్లో 2014 నాటి సీన్ కానీ పొత్తులు కానీ రిపీట్ కాకపోతే పవన్ ఏం చేయబోతున్నారు అన్న చర్చ కూడా నడుస్తోంది. మరి దానికి జవాబు అన్నట్లుగా పవన్ జనసేననే అధికారంలోకి తీసుకురమ్మని జనాలను కోరుతున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నారు.

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సభలకు జనాలు వస్తున్నారు. ఫ్యాన్స్ సంగతి చెప్పనవసరం లేదు. అంతమాత్రం చేత ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయా బలమైన తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి వైసీపీకి ఆల్టర్నేషన్ గా జనసేనను జనాలు చూస్తారా అన్నదే ఇపుడు అందరిలోనూ ఆలోచింపచేస్తున్న అంశంగా ఉంది. ఏది ఏమైనా జనసేన ఇంకా  పొత్తుల మీద ఒక క్లారిటీకి ఇప్పటికైతే రాలేదనే అంటున్న వారూ ఉన్నారు.
Tags:    

Similar News