ముస్లింలకు అదిరే ప్రశ్న వేసిన పవన్.. మరి.. వారేం అంటారో?

Update: 2023-03-15 12:11 GMT
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంలో కొన్ని కీలక అంశాలు.. రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు మారేందుకు దోహదపడేందుకు వీలుగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. తాను కేంద్రంలోని మోడీ సర్కారుకు మద్దతు ఇవ్వటంపై మైనార్టీల్లో తమ మీదా.. తమ పార్టీ మీద జరుగుతున్న దుష్ప్రచారంపై పవన్ ఇచ్చిన వివరణ.. వారిని ఆలోచనల్లో పడేలా మారిందన్న మాట వినిపిస్తోంది.

తాను మోడీకి మద్దతు ఇస్తున్నాను కాబట్టి.. తన వెంట నడిచేందుకు ముస్లింలు సిద్ధంగా లేరన్న విషయాన్ని ఆయన ప్రస్తావించిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై దాడులు జరిగినా.. వారు అభద్రతాభావానికి లోనవుతున్నారని అనుకున్నా.. బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చేస్తానని పవన్ మాటిచ్చారు. ముస్లిం అక్కచెల్లెళ్లు అంతా నన్ను వదిలేస్తామంటున్నారని.. వారందరికి తాను ఒకటే మాట ఇస్తున్నట్లు చెప్పారు.

''నేను బీజేపీతో ఉన్నంతకాలం మీపై దాడులు జరగనీవ్వను. మీరు జగన్ ను నమ్ముతున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా మద్దతు ఇస్తారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. మరి.. ముస్లిం సమాజం ఆయన్ను ఎందుకు అడగదు?'' అంటూ కీలక ప్రశ్నను సంధించారు. ప్రధాని  మోడీకి పవన్ మద్దతు ఇస్తున్నారు కాబట్టి.. మైనార్టీలు జనసేన వెంట నడవొద్దని ప్రచారం చేసే వారికి  షాకిచ్చేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.

కేంద్రంలోని మోడీ సర్కారుకు జగన్ మద్దతు ఇస్తున్నప్పుడు.. ఆయనకు కూడా ముస్లింలు దూరంగా ఉండాలి కదా? అన్న క్వశ్చన్ ను తనదైన శైలిలో అడిగిన పవన్ మాటలు.. ముస్లిం సమాజంలో కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. ఆ తరహాలో ప్రచారం చేసే వారికి షాకిచ్చేలా పవన్ మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. పవన్ మాటల ప్రభావం ముస్లిం ఓట్లర్ మీద కచ్ఛితంగా ఉంటుందంటున్నారు. మరి.. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై జగన్ అండ్ కో ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

Similar News