గ్రౌండ్ రిపోర్ట్: 'పెద్దపల్లి' పెద్దన్న ఎవరో..?

Update: 2019-04-01 06:30 GMT
పార్లమెంట్ నియోజకవర్గం: పెద్దపల్లి

టీఆర్‌ ఎస్‌: బొర్లకుంట వెంకటేశ్‌ నేత
కాంగ్రెస్‌: చంద్రశేఖర్‌
బీజేపీ: ఎస్‌.కుమార్‌

*పెద్దపల్లి చరిత్ర:

అసెంబ్లీ నియోజకవర్గాలు: పెద్దపల్లి - చెన్నూరు - మంచిర్యాల - రామగుండం - ధర్మపురి - బెల్లంపల్లి - మంథని
ఓటర్లు: 14లక్షల 25వేలు

1962లో నియోజకవర్గంగా ఏర్పడింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 8 సార్లు కాంగ్రెస్‌ - టీడీపీ నాలుగుసార్లు తెలంగాణ ప్రజాసమితి ఒకసారి - టీఆర్‌ ఎస్‌ ఒకసారి జెండా ఎగురవేశాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన గడ్డం వెంకటస్వామి 1989 - 1991 - 1996లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. ఆ తరువాత టీడీపీ నుంచి పోటీ చేసిన సుగుణ కుమారి 1998 -1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. 2004లో మళ్లీ కాంగ్రెస్‌ నుంచి వెంకటస్వామి విజయం సాధించగా - 2009లో ఆయన కుమారుడు వివేక్‌ గెలుపొందారు. 2014లో టీఆర్‌ ఎస్‌ ప్రభంజనంలో ఆ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్‌ ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీజేపీ గెలవలేదు.

* అనూహ్యంగా టీఆర్‌ ఎస్‌ టికెట్‌ పొందిన వెంకటేశ్‌ నేత..

ఎక్సైజ్‌శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన బొర్లకుంట వెంకటేశ్‌ నేత 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. కాలినడకతో మారుమూల గ్రామాల్లో తిరిగి ప్రచారం చేసినా ఆయన అక్కడి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్కసుమన్‌ కు గట్టిపోటీనిచ్చారు. అయితే టీఆర్‌ ఎస్‌ ప్రభంజనంలో వెంకటేశ్‌ నేత ఓడిపోయారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి ఎంపీ సీటు కోసం మాజీ ఎంపీ వివేక్‌ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వివేక్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించడానికి ప్రయత్నించాడని గెలిచిన ఎమ్మెల్యేలు చక్రం తిప్పి ఆయనకు టికెట్ దక్కకుండా చేసి కాంగ్రెస్ నేత వెంకటేశ్‌ నేతను టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ బరిలో దింపారు. ధర్మపురి - బెల్లంపలి - చెన్నూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు అయినందును వెంకటేశ్‌ నేతను ఎలాగైనా గెలిపిస్తామని స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.

* అనుకూలతలు:

-ఎమ్మెల్యేల ఫుల్‌ సపోర్టు
-సామాజిక వర్గం అనుకూలంగా ఉండడం
-విద్యావంతుడు కావడం

* ప్రతికూలతలు:

-నాన్‌ లోకల్‌ అభ్యర్థి కావడం
-మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలిచి బలంగా ఉండడం

* ఈసారి చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ ను గట్టెక్కిస్తాడా..?

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గోమాస శ్రీనివాస్‌ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఊహించని పరిణామాల మధ్య పార్టీ అధిష్టానం ఆగం చంద్రశేఖర్‌ను బరిలో నిలబెట్టింది. వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టికెట్‌ దక్కకపోవడంతో చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆయనను పార్టీ సస్పెండ్‌ చేసింది. తిరిగి కొద్దిరోజుల కిందట ఆయనను పార్టీలోకి తీసుకొని బరిలో నిలబెట్టింది.

* అనుకూలతలు:

-వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేయడం
-నియోజకవర్గంలో కొన్ని చోట్ల  కాంగ్రెస్‌ కు అనుకూల పవనాలు
-పార్టీ అండదండలు ఉండడం

*ప్రతికూలతలు:

-నాన్‌లోకల్‌ అభ్యర్థి కావడం
-ఒకటి తప్ప మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉండడం

*పెద్దపల్లిలో టఫ్ ఫైట్..

టీఆర్‌ ఎస్‌ లో దివంగత ఎంపీ జి.వెంకటస్వామి కుమారుడు, మాజీ ఎంపీ అయిన వివేక్‌ కు టికెట్‌ దక్కకపోవడంతో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయడం లేదు. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యేలు మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకటేశ్‌ నేత గెలుపునకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో టీఆర్ఎస్ గెలుపు వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసే చంద్రశేఖర్‌ పేరును ప్రకటించగానే పార్టీలో అసమ్మతి మొదలైంది. అయితే కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు బుజ్జగించడంతో వారు చంద్రశేఖర్‌తో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇక పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి బలం ఉండడంతో ఆ పార్టీ నుంచి ఎస్‌.కుమార్‌ బరిలో ఉన్నారు. కానీ ఎంపీ స్థానంలో ఒక్కసారి కూడా బీజేపీ గెలవలేదు. మొత్తంగా ఇక్కడ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే రసవత్తర పోరు సాగుతోంది. ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.
Tags:    

Similar News