ఎమ్మెల్యే బాల‌కృష్ణ కేసు విచార‌ణ ఆగింది

Update: 2016-09-15 06:02 GMT
వ‌డ్డించేవాడు మ‌న‌వాడైతే.. అన్న యాంగిల్‌ లో.. అధికారంలో ఉన్న‌ది మ‌నోళ్లైతే.. అన్న‌ట్టు.. సీఎం చంద్ర‌బాబు వియ్యంకుడు - హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌పై ఎన్నిక‌ల‌ కేసుపై విచార‌ణ నిలిచిపోయింది. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌స్తుత అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గుంటూరు జిల్లా న‌ర‌సారావు పేట నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. దీంతో ఈయ‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారంచేసేందుకు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ వ‌చ్చారు. అయితే, అప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యం మించిపోవడం - పోటీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయి.

అయ‌నా.. మ‌న హీరోగారు వాటిని లెక్క‌చేయ‌కుండా దూసుకుపోయారు. ఆయ‌న‌ వెంట టీడీపీ ప‌రివారం ప్ర‌స్తుత గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి - కోడెల తనయుడు శివరామకృష్ణ - మరో 15మంది ముఖ్య‌నేత‌లు ర్యాలీలో పాల్గొని ప్ర‌చారం చేశారు. దీనిపై వన్‌ టౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. అది అప్ప‌టి నుంచి విచార‌ణ‌లోనే ఉంది. అయితే, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌.. టీడీపీ ముఖ్య నేత‌ల‌పై ఉన్న కేసుల‌ను ఒక్కొక్క‌టిగా మాఫీ చేస్తూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే బాల‌కృష్ణ‌పై ఉన్న ఈ కేసును కూడా అధికారులు మాఫీ చేశారు.

ఈ కేసులో విచార‌ణ పూర్త‌యింద‌ని, దీనిలో ఎలాంటి పురోగ‌తి లేద‌ని, కాబ‌ట్టి కేసును మూసివేయాల‌ని సిఫార‌సు చేస్తూ.. ఇన్‌ చార్జి డీజీపీ నండూరి సాంబ‌శివ‌రావు.. హోంశాఖ‌కు లేఖ‌రాశారు. దీనిపై స్పందించిన ప్ర‌భుత్వం డీజీపీ సిఫార్సుకు ప‌చ్చ‌జెండా ఊపింది. ఈ క్ర‌మంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ జీవో నంబరు 122ను విడుదల చేశారు. దీంతో బాల‌కృష్ణ‌కు ఊర‌ట ల‌భించింది.
Tags:    

Similar News