బాబు ఒత్తిడికి... పెనుమాక త‌లొగ్గలేదండోయ్‌!

Update: 2017-06-27 10:53 GMT
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం సేక‌రించిన భూముల‌న్నీ రైతులే స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి ఇచ్చార‌ని టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నిత్యం చెబుతూ వ‌స్తున్నారు. త‌మ ప్ర‌భుత్వం రైతుల‌కు ఇవ్వ‌నున్న ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించ‌గా, దానికి సంతృప్తి చెందిన రైతులంతా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి త‌మ భూముల‌ను రాజ‌ధాని నిర్మాణం కోసం ఇచ్చార‌ని, రైతులే స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి 33 వేల ఎక‌రాల‌కు పైగా భూముల‌ను ఇవ్వ‌డం దేశ చ‌రిత్ర‌లోనే ఇదే ప్రథమమని  కూడా బాబు స‌ర్కారు గొప్ప‌లు చెప్పుకుంటోంది. అయితే ఆ స్వ‌చ్ఛందం వెనుక ఎలాంటి వాస్త‌వం లేద‌ని మ‌రోసారి తేలిపోయింది. రైతుల‌ను న‌యానో భ‌యానో ఒప్పంచి భూములు లాగేసుకున్నార‌ని వాదిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో స‌త్యం లేక‌పో్లేదు సుమా అనే వాస్త‌వం మ‌రోసారి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇక అస‌లు విష‌యంలోకి వెళితే... రాజ‌ధాని ప్రాంతంలోని పెనుమాక‌లో ఇప్ప‌టికీ రైతులు త‌మ  భూముల‌ను అమ‌రావ‌తి నిర్మాణానికి ఇవ్వ‌లేదు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పున‌రావాసం త‌మ‌కు స‌రిపోద‌ని ఆది నుంచి నెత్తీనోరు బాదుకుంటున్న రైతులు కోర్టుల‌ను ఆశ్ర‌యించారు. ఈ విష‌యంలో రైతుల‌ను అనుమ‌తితోనే ఆ భూముల‌ను సేక‌రించాల‌ని కూడా ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే భూసేక‌ర‌ణ చ‌ట్టంలోని కొన్ని లొసుగుల‌ను ఆస‌రా చేసుకున్న ప్ర‌భుత్వం... పెనుమాక స‌హా మ‌రికొన్ని గ్రామాల్లోని భూముల‌ను లాగేసుకునేందుకు నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఈ నోటిఫికేష‌న్ ఆధారంగా ఆయా గ్రామాల్లో సీఆర్డీఏ అధికారులు వ‌రుస‌గా స‌మావేశాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా తొలుత పెనుమాక‌లోనే నేటి ఉద‌యం స‌మావేశం నిర్వ‌హించారు. సీఆర్డీఏ అధికారుల విజ్ఞ‌ప్తి మేర‌కు భూముల‌న్న రైతుల‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కూడా స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆర్కేతో పాటు రైతులు కూడా త‌మ మ‌న‌సులోని అనుమానాల‌ను అధికారుల ముందు పెట్టారు.

రైతుల అనుమానాల‌ను నివృత్తి చేయాల్సిన అధికారులు... చంద్ర‌బాబు స‌ర్కారు త‌మ‌కు నిర్దేశించిన మార్గాన్నే అనుస‌రించేందుకు య‌త్నించారు. దీంతో త‌మ అనుమానాల‌ను నివృత్తి చేయ‌కుండా, త‌మ‌ను సంతృప్తిప‌ర‌చ‌కుండా త‌మ భూముల‌ను ఎలా లాగేసుకుంటారంటూ రైతులు ఒక్క‌సారిగా అధికారుల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా రైతులు, అధికారుల‌కు మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జ‌ర‌గ‌గా... ఎంత‌కూ త‌మ వాద‌న‌ను ప‌ట్టించుకోని అధికారుల‌పైకి రైతులు దండెత్తారు. స‌మావేశం నిర్వ‌హ‌ణ కోసం ఏర్పాటు చేసిన ఫ‌ర్నీచ‌ర్‌ ను ధ్వంసం చేశారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రైతుల‌కే కాకుండా ప్ర‌జా ప్ర‌తినిధిగా ఉన్న ఆర్కే ప్ర‌శ్న‌ల‌కు కూడా అధికారులు నిర్ల‌క్ష్యంగానే స‌మాధానాలు చెప్పిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News