అక్కడ పాలు అమ్మితే అరిష్టం.. ఎన్నికావాలన్నా ఉచితమే..!

Update: 2022-02-01 00:30 GMT
ప్రస్తుతం కాలం మారింది. అంతా కమర్షియల్ అయింది. పల్లెటూర్లలో ఒకప్పుడు కూరగాయలు, మజ్జిగ వంటి ఒకరికొకరు ఉచితంగా ఇచ్చుకునేవారు. కానీ ఇప్పుడు చాలాచోట్ల బేరాలు మొదలెట్టారు. కనీసం రెండు సోరకాయలు కాసినా వాటిని... కిరాణా దుకాణంలో విక్రయిస్తున్నారు. తన లాభం చూసుకుని ఆ దుకాణదారుడు వేరే వారికి విక్రయిస్తాడు. ఇక పాలు, నీళ్లు కూడా ఇవాళ పెద్ద వ్యాపారమే. నగరాల్లో అయితే సొమ్ము చేసుకోవడానికి పసిపిల్లలు తాగే అమృతం వంటి పాలను కాలకూట విషంతో తయారు చేసేవారు లేకపోలేదు. పాలను నీళ్లుగా మార్చి అమ్మే వ్యాపారులు కూడా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి రోజుల్లో ఓ ఊరిలో మాత్రం పాలు అమ్మరు. ఎన్ని కావాలన్నా కూడా ఉచితంగా ఇస్తారు. పెరుగు, మజ్జిగ వంటివి కూడా ఫ్రీ. వీటిని అమ్మితే ఇక వారికి అరిష్టమని వారి నమ్మకం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా... ఇది ఆ ఊరి ఆచారం.

పాలను ఎందుకు అమ్మకూడదనే ఆచారాన్ని ఆ ఊరి ప్రజలంతా పాటిస్తారు. ఎందుకంటే దానికి ఓ ప్రత్యేకమైన స్టోరీ ఉంది. ఇది ఇప్పుడు సృష్టించిన కథ కాదు. తాత, ముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇంతకీ ఆ ఊరు ఎక్కడా అనుకుంటున్నారా..! అదేనండి ఆంధ్రప్రదేశ్ లోనే ఆ గ్రామం ఉంది. అనంతపురం జిల్లాలోని తాడిమర్రికి ఉత్తర దిశలో 23 కిలోమీటర్ల దూరంలో చిల్లవారిపల్లి గ్రామం ఉంది. ఈ ఊరిలోనే ప్రజలు పాలను విక్రయించరు. పాలు, పెరుగు వంటి వాటిని అమ్మితే అరిష్టంగా భావిస్తారు. పది పదిహేను గేదెలు, ఆవులు పాలు ఇచ్చినా కూడా విక్రయించే ప్రసక్తే లేదని చెబుతున్నారు ఆ గ్రామస్థులు.

చిల్లవారిపల్లె గ్రామస్థుల వివరాల ప్రకారం... పూర్వం చాలా గేదెలు ఉండేవి. అయితే ఒకరోజు పాలకుండలో కాటికోటేశ్వరస్వామి దర్శనమిచ్చాడు. నవయువకుని రూపంలో స్వామి ప్రత్యక్షమయ్యాడు. అంతేకాకుండా గుడి కట్టాలని ఊరి ప్రజలను కోరాడు. గ్రామస్థులంతా కలిసి స్వామికి గుడి కట్టించారు. స్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఏటా సంక్రాంతి, కనుమ పండుగలకు పూజలు చేస్తారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ విధంగా ఆ ఊరి ప్రజలకు ఆరాధ్య దైవం కాటికోటేశ్వరస్వామి. ఆయన పాల కుండలో కనిపించినందున పాల వ్యాపారం నిషిద్ధం. పాలను అమ్మినా... కొన్నా అరిష్టమేనని ఆ గ్రామస్థులు భావిస్తారు.

చిల్లవారిపల్లె గ్రామంలో 400 కుటుంబాలు నివసిస్తాయి. మొత్తం 1900 మంది గ్రామస్థులు ఉంటారు. వారిలో 1100 మందికి ఓటు హక్కు ఉంది. ఆ ఊరిలో 300 దాకా పాడి ఆవులు, గేదెలు ఉన్నాయి. రోజూ వందల కొద్ది లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. కానీ చుక్క కూడా విక్రయించరు. ఎవరికి ఎంత కావాలన్నా కూడా ఉచితంగానే ఇస్తారు. కాదని ఎవరైనా అమ్మితే వారికి ఇక అరిష్టమేనని భావిస్తారు.

తమ ఆరాధ్య దైవం కాటికోటేశ్వర స్వామి ప్రతిరూపంగా పాలను చూస్తామని గ్రామస్థులు అంటున్నారు. అందుకే పాలను అమ్మడం, కొనడం వంటివి చేయబోమని అంటున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కాటమయ్య స్వామి అని పేర్కొన్నారు. ఇక ఆ ఊరిలో స్వామికి సంబంధించిన పేర్లు 80 శాతం ఉంటాయని చెప్పారు. ఇంటి ఇలవేల్పుగా ఉండే కాటమయ్య ప్రతిరూపమైన పాలను విక్రయిస్తే అరిష్టమని నమ్ముతామని గ్రామస్థులు వివరించారు.
Tags:    

Similar News