య‌థేచ్ఛ‌గా రోడ్ల‌పై.. హైద‌రాబాద్‌ వాసుల‌కు ఏమైంది..?

Update: 2020-05-09 09:50 GMT
క‌రోనా క‌ట్ట‌డి కోసం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మొన్న ఏర్పాటుచేసిన మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు తెలిపారు. మ‌రికొన్నాళ్ల పాటు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరుతూ లాక్‌ డౌన్‌ ను మే 29వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌, -రంగారెడ్డి - మేడ్చ‌ల్ మిన‌హా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొంత స‌డ‌లింపులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న తెల్లారే హైద‌రాబాద్‌ లో ప్ర‌జ‌లు య‌థేచ్ఛ‌గా తిర‌గ‌డం మొద‌లుపెట్టారు. ఎందుకంటే మ‌ద్యం దుకాణాలు ప్రారంభ‌మ‌య్యాయి. మ‌ద్యం కోసం భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చారు. మొద‌టి రోజు అంటే స‌రే. కానీ రెండు - మూడు రోజులుగా హైద‌రాబాద్‌ లో ప్ర‌జ‌ల రాక‌పోక‌లు సాధార‌ణ స్థితికి చేరాయి. రెడ్‌ జోన్‌ గా ఉన్న హైద‌రాబాద్‌ లో ప్ర‌జ‌లు య‌థేచ్ఛ‌గా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు.

గురు, శుక్ర‌వారాల‌తో పాటు శ‌నివారం కూడా ప్ర‌జ‌లు భారీసంఖ్య‌లో బ‌య‌ట‌కు వ‌చ్చారు. రోడ్ల‌పై వాహ‌నాల రాక‌పోక‌లు భారీగా మొద‌ల‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఇన్నాళ్లు బంద్ చేసిన ట్రాఫిక్ సిగ్న‌ళ్లు ప్రారంభించారు. వాహ‌నాలు రోడ్ల‌పై బారులు తీరాయి. ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌గా విహ‌రిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు ప‌క‌డ్బందీగా కొన‌సాగిన లాక్‌ డౌన్ కొంత స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లు - కంపెనీల్లో 30 శాతం ఉద్యోగులు ఉండ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వం స‌డ‌లింపులు ఇచ్చింది. దీంతో ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఉద్యోగ బాట ప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం చేసిన పోలీసులు ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను నిలువ‌రించ‌డం లేదు. అన్ని త‌నిఖీ కేంద్రాల్లో పోలీసులు త‌నిఖీల‌ను నిలిపివేశారు. కేవ‌లం బందోబ‌స్తును ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దీంతో కొంద‌రు అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ద్విచ‌క్ర వాహ‌నాల‌పై ఒక‌రు కాకుండా ఇద్ద‌రు, ము‌గ్గురు, కారుల‌లో పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు రాక‌పోక‌లు సాగిస్తున్నారు. దీంతో హైద‌రాబాద్‌ లో లాక్‌ డౌన్ ఎత్తివేశారా? అనే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌జ‌లు ఆపి త‌నిఖీలు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు మ‌రింత రోడ్ల‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. కేవ‌లం ఉద్యోగుల‌ను అనుమ‌తించాల‌ని.. మిగ‌తా వారిని క‌ట్ట‌డి చేయాల‌ని ప‌లువురు కోరుతున్నారు. లాక్‌ డౌన్‌ ను మ‌రికొన్నాళ్లు క‌ఠినంగా అమ‌లుచేయాల‌ని సూచిస్తున్నారు.

రాష్ట్రంలో అత్య‌ధికంగా హైద‌రాబాద్‌ లోనే క‌రోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. భారీగా కంటైన్‌ మెంట్ జోన్లు ఉన్నాయి. మ‌రి అలాంటి హైద‌రాబాద్‌లో నిర్ల‌క్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. స‌డ‌లింపులు ఇచ్చినా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా అనుమ‌తించి మిగ‌తా వారిని క‌ట్ట‌డి చేయాల‌ని కోరుతున్నారు.
Tags:    

Similar News