ఎన్నికల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యం: సుమన్

Update: 2021-01-25 14:12 GMT
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఓ వైపు కరోనా కేసులు నమోదవడం...మరోవైపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల వాయిదాకే ఏపీ సర్కార్ మొగ్గు చూపింది. కానీ, వ్యాక్సినేషన్ తో పాటు ఎన్నికల నిర్వహణ కూడా ముఖ్యమంటూ సుప్రీం తీర్పునిచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ పట్టుబట్టిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ప్రజలు, ఉద్యోగుల రక్షణకు ప్రాధాన్యతనివ్వాలని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందిపెట్టడం సరికాదని సుమన్ వ్యాఖ్యానించారు.

గత ఏడాది ఎన్నికలను ప్రభుత్వంతో సంప్రదించకుండా వాయిదా వేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, పంచాయతీ ఎన్నికలు సరైన సమయంలో జరిగి ఉంటే బావుండేదని సుమన్ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సుమన్ ఏపీలో విగ్రహాల ధ్వంసంపై కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలపై దాడి ఘటనలు విచారకరమని సుమన్ అన్నారు.

కావాలనే కొందరు విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని సుమన్ ఆరోపించారు. ఆ ఘటనలకు సంబంధించి సీఎం జగన్ ను విమర్శించడం, ఆ ఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత అనడం దారుణమని సుమన్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైందని, విభజన తర్వాత కూడా ఏపీలో అదే తప్పు జరిగిందని పరోక్షంగా అమరావతిని ఉద్దేశించి సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

3 రాజధానులతోనే ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం సరైనదని సుమన్ సమర్థించారు. సీఎం జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత కొద్ది నెలలకే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం శుభపరిణామని సుమన్ ప్రశంసించారు.

ఇళ్లపట్టాల విషయంలో దేశంలోని ప్రతి రాష్ట్రం ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఏపీ ప్రజలు యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ సీఎంను ఎన్నుకున్నారని, జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, జగన్ హయాంలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని సుమన్ కితాబిచ్చారు.
Tags:    

Similar News