రాజారెడ్డిని చంపినోళ్లకు క్షమాభిక్ష

Update: 2016-01-27 04:50 GMT
ఏపీలో చంద్రబాబు సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం సంచలనంగా మారింది. దివంగత మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న తీసుకున్న చర్చనీయాంశంగా మారింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన ఏపీ సర్కారు.. ఈ కేసులో నిందితులైన 12 మందిలో 10 మందికి స్వేచ్ఛను ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.

1998 మే 23న వైఎస్ రాజారెడ్డిని కడప జిల్లా వేముల సమీపంలో బాంబులేసి ప్రత్యర్థులు ఆయన్ని చంపేశారు. ఈ వ్యవహారంపై విచారణ సాగి మొత్తం 12 మందిని నిందితులుగా గుర్తించారు. 2006 అక్టోబరు 16న హైకోర్టు ఈ కేసులోనిందితులుగా ఉన్న 12 మందికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులైతే.. వీరిలో ఉమామహేశ్వరరెడ్డి విచారణ సమయంలోనే మరణించటంతో యావజ్జీవ శిక్ష పదకొండుమందికి పడింది.

తాజాగా ఏపీలో మొత్తం 163 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించగా.. వీరిలో పది మంది రాజారెడ్డి హత్య కేసులో దోషులు ఉండటం గమనార్హం. మిగిలిన ఒక్కరిపై మిగిలిన కేసులు ఉండటంతో క్షమాభిక్షకు సాధ్యం కాలేదు. ఏపీ సర్కారు క్షమాభిక్షను ప్రసాదించటంతోవిడుదలైన పది మంది ఖైదీలకు ఘనస్వాగతం పలుకుతూ వారి కుటుంబ సభ్యులు జైళ్ల నుంచి ఇంటికి తీసుకెళ్లారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు చిన్న శేషారెడ్డి.. అతని అన్న సోమశేఖర్ రెడ్డి.. బావ విశ్వనాధరెడ్డి విడుదలైన సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు దాదాపు 60 వాహనాల్లో బంధువులు జైలు వద్దకు వచ్చి.. వారికి స్వాగతం పలికి ఇంటికి తీసుకెళ్లటం జరిగింది. చంద్రబాబు సర్కారు ప్రసాదించిన క్షమాభిక్ష రాజకీయ వివాదంగా మారే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News