ఏ పార్టీ వారైనా డైరెక్ట్‌గా మాట్లాడాలి.. రేవంత్ రెడ్డికి కౌంటరిచ్చిన పేర్నినాని

Update: 2021-10-29 13:30 GMT
ఏపీలో పార్టీ పెడుతామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ ప్రజలను టీఆర్ఎస్ పాలన కావాలని కోరుతున్నారని ప్రకటించి.. ఇప్పుడు మౌనంగా ఉన్నారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబడుతూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్, వైసీపీ మధ్య వివాదం రేపుతోంది. కేసీఆర్ వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటిరిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలపడానికి కేసీఆర్‌ చొరవ తీసుకుంటే.. ఏపీ తరఫున తాము సహకరిస్తామని ప్రకటించారు. దీంతో పేర్ని నాని కామెంట్స్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ జోలికొస్తే ఖబడ్డార్ అంటూ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. కేసీఆర్‌ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలి ఇచ్చే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వందల మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.


రేవంత్‌రెడ్డి ట్వీట్‌పై మంత్రి పేర్నినాని కూడా ఘాటుగా కౌంటరిచ్చారు. రేవంత్‌కు రోజూ రాజకీయాలు కావాలని తప్పుబట్టారు. ప్రతిరోజూ రాజకీయాల్లో ఉండాలనుకునే వారు ఇలాగే మాట్లాడతారని రేవంత్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెప్పిన మాటలపైనే మాట్లాడానని పేర్నినాని వివరణ ఇచ్చారు. జగన్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడరని చెప్పారు. తెలంగాణలో ఒక తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని, మళ్లీ కొత్త పార్టీ ఎందుకు అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీలో శూన్యత ఎక్కడుంది? అని ప్రశ్నించారు. నదీ జలాల వినియోగంలో సీఎం కేసీఆర్ మాటతప్పారని దుయ్యబట్టారు. డిండి-పాలమూరు ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు మళ్లించారని పేర్ని నాని విమర్శించారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా చెంచాడు నీళ్లు కూడా వినియోగించబోమని పేర్నినాని స్పష్టం చేశారు.

కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టడాన్ని ఏపీ మంత్రులు, ప్రభుత్వ సలహదారు స్వాగతిస్తూనే. ఆయన వ్యాఖ్యలపై కౌంటిరిస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మొన్న మంత్రి అనిల్, నిన్న పేర్నినాని, సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యంతరం తెలిపారు. ఇప్పటివరకు కేసీఆర్, వైసీపీల మధ్యనే మాటల యుద్ధం నిడిచింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా ఎంట్రీ అయ్యారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.




Tags:    

Similar News