ఈటల కోటరీలో కోవర్టులు !

Update: 2021-09-27 03:04 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంత కీల‌కంగా మారిందో తెలిసిన విష‌య‌మే. అటు అధికార పార్టీ టీఆర్ఎస్‌కు.. ఇటు బీజేపీ త‌ర‌పున పోటీ చేయ‌బోయే ఈట‌ల రాజేంద‌ర్‌కు ఈ ఉప ఎన్నిక విష‌మ ప‌రీక్ష లాంటిది. దీంతో విజ‌యం కోసం కేసీఆర్‌, ఈటల త‌మ త‌మ వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నిక‌లో గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్‌.. ఇప్ప‌టికే ఆ బాధ్య‌త‌ను త‌న మేన‌ళ్లుడు హ‌రీష్ రావు భుజాల‌పై మోపారు. దీంతో మొన్న‌టివ‌ర‌కూ హ‌రీష్‌తో పాటు టీఆర్ఎస్ కీల‌క నాయ‌కుల‌తో హుజూరాబాద్‌లో ప్ర‌చారం హోరెత్తింది. ఈట‌ల రాజేంద‌ర్ కూడా త‌న పాద‌యాత్ర‌తో నియోజ‌వ‌క‌ర్గంలో తిరిగారు. దీంతో అక్క‌డ మైకుల చ‌ప్పుడు హోరెత్తింది. కానీ ఆ ఉప ఎన్నిక‌ను పండ‌గ‌ల సీజ‌న్‌లో అంటే న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో నిర్వ‌హిస్తామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేయ‌డంతో అక్క‌డ అంతా సైలెంట్ అయిపోయింది.

బ‌య‌ట‌కు నిశ్శ‌బ్దంగా క‌నిపిస్తున్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో తెర‌వెన‌క ప్ర‌చారం మాత్రం వేగంగా సాగుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు తెర‌వెన‌క నేత‌లు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఎంత లాబీయింగ్ చేస్తున్నార‌నేది ఇప్పుడు కీల‌కంగా మారింది. ఈ విష‌యంలో కేసీఆర్ త‌నదైన శైలిలో దూసుకుపోతున్నార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. త‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి.. ఇప్పుడు టీఆర్ఎస్‌పైనే పోటీకి సిద్ధ‌మైన ఈట‌ల‌ను ఓడించాల‌ని కేసీఆర్ శాయాశ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే మొద‌లెట్టారు. ఇప్ప‌టికే ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి డ‌బ్బులు జ‌మ చేస్తున్నారు. అయితే వెన‌కాల మాత్రం టీఆర్ఎస్ అభ్య‌ర్థిని గెలిపిస్తేనే నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని లేదంటే ద‌ళిత బంధు అంద‌కుండా చేస్తామంటూ కింది స్థాయి నేత‌లు ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తున్నట్లూ తెలుస్తోంది.

ఈట‌ల‌ను గెలిపిస్తే ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి నిధులు రావ‌ని వాళ్లు స్ప‌ష్టం చేస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. దీంతో ద‌ళితుల ఓట్ల‌న్నీ టీఆర్ఎస్‌కే సొంత‌మ‌యేలా అక్క‌డి ప‌రిస్థితులు మారిపోతున్నాయి. దాదాపు 35 వేల ఓట్లు ఈట‌ల చేజారిపోతున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఈట‌ల చుట్టూ ఉన్న నేత‌ల్లో టీఆర్ఎస్ కోవ‌ర్టులు ఉన్నార‌నే చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న ప‌క్క‌న ఉంటూనే ఓట‌మి కోసం ప‌ని చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఆ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఈట‌ల బావ‌మ‌రిది వాట్సాప్ చాటింగ్ ఈట‌ల గ‌డియారాలు పంచే కార్య‌క్ర‌మాల ఫుటేజీ ఈట‌ల‌కు ద‌ళితులు పాలాభిషేకం చేసి కాళ్లు క‌డిగిన వీడియోలు క్ష‌ణాల్లో టీఆర్ఎస్ నాయ‌కుల‌కు చేరిపోయాయంటా! ఇక కులాల వారీగానూ ఇప్ప‌టికే పంప‌కాలు జ‌రిగిపోయాయ‌ని తెలుస్తోంది.

ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక జ‌రిగితే ఈట‌ల‌కే గెలిచే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌న్న ఇంటిలిజెన్స్ రిపోర్ట్ కార‌ణంగానే క‌రోనా సాకుగా చూపించి ఈ ఎన్నిక వాయిదా ప‌డేలా కేసీఆర్ చేశార‌నే టాక్ ఉంది. ఈ స‌మయంలో తెర‌వెనుక వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్‌.. అన్ని వ‌ర్గాల వాళ్ల‌ను టీఆర్ఎస్ వైపుగా తిప్పుకునేందుకు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని త‌ట‌స్థులు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. ఈ ఎన్నిక‌ను కేసీఆర్‌, ఈట‌ల మ‌ధ్య వ్య‌క్తిగ‌త పోరుగానే వాళ్లు చూస్తున్నారు. దీంతో ఈట‌ల త‌ర‌పున నిల‌బ‌డి ఎందుకు న‌ష్ట‌పోవాల‌నే ఉద్దేశంతో కేసీఆర్‌కే మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. ఇలా కేసీఆర్ తన ప్ర‌ణాళిక‌ల‌కు స‌మ‌ర్థంగా అమ‌లు చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.




Tags:    

Similar News