సీఎం ప్రెస్ మీట్ మాటలకు భిన్నంగా గ్రౌండ్ లెవల్ ఫోటోలు

Update: 2021-11-17 13:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం వచ్చింది. అలా ఇలా కాదు.. ఇటీవల కాలంలో ఎప్పుడూ రానంతగా. నిజమే.. కాలం కలిసి రానప్పుడు వచ్చే ఆగ్రహాం మాదిరి ఉన్నట్లుగా పలువురు చెబుతున్నారు.

తాను మాట్లాడితే సీన్ మొత్తం మారేలా.. తాను పావులు కదిపితే ఆట మొత్తం మారిపోయేలా.. తాను వ్యూహం పన్నితే రాజకీయ ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితికి భిన్నంగా ప్రతిది ఎదురు తిరుగుతున్నట్లుగా ఉంటున్న తీరుతో గులాబీ బాస్ లో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరినట్లుగా చెబుతున్నారు.

ఈ కారణంతోనే ధర్నా చౌక్ వద్దకు తాను స్వయంగా వచ్చి ధర్నా చేయనున్నట్లుగా ప్రకటించిన కేసీఆర్ మాటలు సంచలనంగా మారాయి. టీఆర్ఎస్ అధినేత కాలు బయటకు పెట్టి.. ధర్నా బాట పట్టటం అంటే మాటలా? ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అననుసరిస్తున్న ద్వంద వైఖరి అంటూ దుమ్మెత్తి పోస్తున్న కేసీఆర్.. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ తో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం పాత విషయమే.

ఈ మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర బీజేపీ నేతల తీరును తూర్పార పట్టారు. వడ్లను కొనుగోలుచేయటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6600 కొనుగోలు కేంద్రాల్ని తెరిచామని..కొంటున్నామని పేర్కొన్నారు. కానీ.. బీజేపీ వాళ్లుమాత్రం ఆ కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి డ్రామా మొదలు పెట్టారన్నారు. ఇక్కడితో ఆగితే బాగుండేది. కానీ.. కేసీఆర్ అలా కాదు కదా.

తన మాటల మేజిక్ తో భావోద్వేగాన్ని రగిలించానుకున్నారో ఏమో కానీ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తుస్ మనేలా చేశాయి. అదెలానంటే..తెలంగాణలో రైతుల నుంచి వస్తున్న ధాన్యాన్ని కొనేందుకు అన్నీ ఏర్పాట్లు చేశామని.. భారీగా కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేశామన్న కేసీఆర్ ఇంకేం చెప్పారంటే.. ‘‘రాష్ట్రంలో కోతలే ఇంకా కాలేదు. 10 శాతం ధాన్యం కూడా రాలేదు.

కోటి 65 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది. ఇప్పటివరకు వచ్చింది 9 లక్షల టన్నులే. ఇప్పుడిప్పుడే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆయన చెప్పినట్లే పది శాతం కూడా ధాన్యం బయటకు రాకుంటే..రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వందలాది మంది రైతులు తాము పండించిన పంటను కొనుగోలుకేంద్రాల వద్దకు తీసుకొచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్న పరిస్థితి.

దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మీడియాలో వస్తున్నాయి. అనుకోనిరీతిలో కురిసిన అకాల వర్షాలు ధాన్యపురాశుల్ని సిద్ధం చేసిన రైతుల పొట్ట కొట్టేసింది. వర్షపు తీవ్రతకు కొన్నిచోట్ల వడ్లు కొట్టుకుపోతే.. మరికొన్నిచోట్ల వడ్లు మొలకలు వస్తున్నాయి. దీంతో.. వారు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

గడిచిన రెండు రోజుల్లో కామారెడ్డి.. నల్గొండ.. కరీంనగర్.. పెద్దపల్లి.. సిరిసిల్ల జిల్లాల్లో అకాల వర్షాలకు వేలాది క్వింటాళ్ల మేర వడ్లరాశులు తడిచిపోయి.. రైతులు గోస పడే పరిస్థితి.

కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేశామని బల్లగుద్ది మరీ చెప్పే కేసీఆర్ మాటలకు.. వాస్తవానికి మధ్య తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న వైనం ఇప్పుడు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్న వేళ.. దానికి భిన్నంగా కేసీఆర్ మాటలు ఉంటం ఆయనకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పక తప్పదు. కేసీఆర్ మాటలకు.. తాజాగా కొన్ని మీడియా సంస్థలకు చెందిన దినపత్రికల్లో పబ్లిష్ అయిన ఫోటోలకు ఎక్కడా సింక్ కాకపోవటం గులాబీ బాస్ కు ఇబ్బందిని కలిగించేదేనని చెప్పక తప్పదు.




Tags:    

Similar News