జై పవన్ : పిఠాపురం పిలుస్తోంది...

Update: 2022-07-15 01:30 GMT
జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలోకి వెళ్లకుండా ఏ శక్తీ ఆపలేదు అని జనసైనికులు చెబుతున్నారు. ఆయన కనుక పోటీ చేస్తే నూటికి నూరు శాతం ఓట్లు వేసి గెలిపించుకుంటామని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం ప్రజలు అంటున్నారు. ఇక్కడ బలమైన కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. అదే టైమ్ లో వారంతా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. వివిధ రకాలైన యూ ట్యూబ్ ఛానళ్ళ అభిప్రాయ సేకరణలో ఈ విషయం బయటపడుతోంది.

నిజానికి  పవన్ కళ్యాణ్ గతసారే అంటే 2019 ఎన్నికల్లోనే పిఠాపురం నుంచి పోటీ చేసి ఉంటే గెలిపించేవాళ్ళమని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన అభ్యర్ధిగా  పోటీ చేసిన మాకినీడు శేషుకుమారికి ఏకంగా 28 వేల ఓట్లు వచ్చాయి. ఒక వైపు జగన్ వేవ్ అలా కొనసాగుతున్నా కూడా ఆమె అన్ని వేల ఓట్లు తెచ్చుకోవడం అంటే విశేషంగానే చూడాలి.

ఇక ఇపుడు చూస్తే టోటల్ సీన్ మారిపోయింది. దాంతో పిఠాపురంలో పవన్ నామ స్మరణ ఎక్కువగా వినిపిస్తోంది. పవన్ కనుక పిఠాపురం నుంచి బరిలోకి దిగితే పార్టీలు ఏవీ అన్నది చూడామని అంతా ఆయనకే ఓట్లేస్తామని యవ జనాలు  అంటున్నారు. పిఠాపురంలో జనసేనకు మంచి క్యాడర్ కూడా ఉంది. ఎంపీటీసీ  సీటు కూడా ఆ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలిపించుకుంది.

ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయడానికి   జనసేన తరఫున శేషుకుమారి రెడీ అవుతున్నారు కానీ సొంతంగా ఆమె పోటీ చేస్తే గెలుపు కష్టమని అంటున్నారు. ఇక టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మకు విజయాకాశాలు బాగా ఉన్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పట్ల వ్యతిరేకత బాగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఆయన మూడేళ్ళుగా జనాలకు దూరంగా ఉన్నారని, పెద్దగా దేనికీ రెస్పాండ్ కారని ప్రచారం అయితే ఉంది.

ఇపుడు గడపగడపకూ కార్యక్రమం తో ఆయన బయటకు వచ్చినా దొరబాబు మీద సొంత పార్టీలో కూడా వ్యతిరేకత ఉంది అంటున్నారు. కాకినాడ ఎంపీ వంగా గీతకు ఇక్కడ మంచి క్యాడర్ ఉంది. 2009 ఎన్నికల్లో ఆమె ఇక్కడ నుంచి పోటీ చేసి ప్రజారాజ్యం తరఫున గెలిచారు. ఈసారి ఆమెకు టికెట్ ఇస్తే కనుక వైసీపీకి విజయావకాశాలు పెరుగుతాయని అంటున్నారు.

మరో వైపు చూస్తే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గతం కంటే ఎక్కువ ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఈసారి అభ్యర్ధి ఎవరైనా కచ్చితంగా యాభై వేల ఓట్లు జనసేనకు పిఠాపురంలో పడడం ఖాయంగా ఉంది అంటున్నారు. అదే ప‌వన్ నేరుగా దిగివస్తే ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఆయన్ని గెలిపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు.

 అదే టైమ్ లో కాకినాడ, రూరల్, అర్బన్, పెద్దాపురం సహా చాలా నియోజకవర్గాల మీద పవన్ పోటీ చేసిన ప్రభావం పడి అక్కడ కూడా జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు. మరి పవన్ కి స్థానికంగా పోటీ చేయాలని ప్రతిపాదనలు వెళ్తున్నాయి. పవన్ సైతం ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలలో పిఠాపురం ఉంది అంటున్నారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
Tags:    

Similar News