ర‌ష్యాలో విమాన ప్ర‌మాదం...41 మంది దుర్మ‌ర‌ణం

Update: 2019-05-06 09:46 GMT
పౌర విమాన‌యానంలో మ‌రో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. నేటి ఉద‌యం ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో రేగిన మంట‌ల్లో వీరంతా కాలి బూడిద‌య్యారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో విమానంలో మొత్తం 73 మంది ప్ర‌యాణికులు, ఐదుగురు సిబ్బంది... మొత్తం 78 మంది ఉండ‌గా... వీరిలో స‌గానికి పైగా 41 మంది మృత్యువాత ప‌డ‌గా... 37 మంది అతి క‌ష్టం మీద ప్రాణాలు అర‌చేత బ‌ట్టుకుని విమానం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. విమానంలోని ఎమ‌ర్జెన్సీ ఎగ్జిట్ ల ద్వారా వీరంతా ప్రాణ‌భ‌యంతో బ‌య‌ట‌కు ప‌రుగులు పెడుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయాయి.

ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... నేటి  ఉద‌యం మాస్కో నుంచి 73 మంది ప్ర‌యాణికులు, ఐదుగురు సిబ్బందితో టేకాఫ్ తీసుకున్న సుఖోయ్ సూప‌ర్ జెట్ విమానం కాసేప‌టికే తిరిగి వ‌చ్చింది. విమానంలో త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే తిరిగి వ‌చ్చిన ఈ విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో నేల‌ను బ‌లంగా తాకింది. దీంతో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో విమానంలోని ప్రయాణికులు మంట‌ల్లో చిక్కుకుపోయారు. వీరిలో 37 మంది ప్రాణాలు ద‌క్కించుకున్నా... 41 మంది విమానంలో రేగిన మంట‌ల్లోనే కాలి బూడిద‌య్యారు. గాల్లో ఉండ‌గానే విమానంలో మంట‌లు చెల‌రేగాయని తొలుత అనుమానించినా... ఆ త‌ర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ స‌మ‌యంలో ర‌న్ వేను బ‌లంగా ఢీకొడుతూ విమానం ల్యాండ్ కావ‌డంతోనే మంట‌లు చెల‌రేగాయ‌ని అధికారులు నిర్ధారించారు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిన కార‌ణంగానే విమానం తిరిగి వ‌చ్చింద‌ని ఓ వాద‌న వినిపిస్తుండ‌గా, విమానంలోని ఫ్యూయ‌ల్ ట్యాంకుల్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫుల్ గా ఇంధ‌నం ఉండ‌టంతోనే పైల‌ట్ దానిని తిరిగి ఎయిర్ పోర్టుకు తీసుకువ‌చ్చార‌ని మ‌రో వాద‌న వినిపిస్తోంది. ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ లో విమానం ర‌న్ వేను బ‌లంగా ఢీకొట్ట‌డంతో విమానంలోని ఫ్యూయ‌ల్ ట్యాంకులు పేలాయ‌ని, దీంతోనే మంట‌లు చెల‌రేగాయ‌ని తెలుస్తోంది. ఏది ఏమైనా పౌర విమాన‌యానంలో మ‌రో ఘోర ప్ర‌మాదం న‌మోదైపోయింది. మృతుల్లో ఇద్ద‌రు చిన్నారు కూడా ఉన్నార‌ట‌.

    

Tags:    

Similar News