ప్లానెట్ పరేడ్.. వెయ్యేళ్ల తర్వాత ఇప్పుడే.. మనకంటే సుడిగాళ్లు ఎవరున్నారు?

Update: 2022-04-28 04:32 GMT
అనంత విశ్వంలో మనకు అర్థమయ్యే వాటి కంటే ఏ మాత్రం మింగుడుపడని ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటిని శోధించి.. సాధించేందుకు మరెన్ని వందల ఏళ్లు పడుతుందో చెప్పలేం. మనకున్న పరిమిత అవగాహనతో కొన్ని వింతల్ని.. విశేషాల్ని గుర్తిస్తుంటారు మన ఖగోళ శాస్త్రవేత్తలు. తాజాగా అలాంటి ఒక అరుదైన ఉదంతాన్ని గుర్తించారు. దాదాపు వెయ్యేళ్ల తర్వాత (1000 ఏళ్లు బాస్) ఒకే వరుసలోకి నాలుగు గ్రహాలు రానున్నాయి.

అదెలానంటే.. ఖగోళంలోని ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనమిచ్చాయి. శుక్రుడు.. అంగారకుడు.. బృహస్పతి.. శని గ్రహాలు ఒకే రేఖపై కనువిందు చేసిన అరుదైన ఖగోళ విశేషం చోటు చేసుకుంది. ఇదంతా బుధవారం తెల్లవారుజాముకు కాస్త ముందు.. ఈ గ్రహాలు ఒకే రేఖపై దర్శనమిచ్చినట్లుగా భువనేశ్వర్ లోని పఠాని సమంత ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ సువేందు పట్నాయక్ వెల్లడించారు.

ఇలాంటి విశేషం 2022 ఏప్రిల్ 26, 27 తేదీల్లో కనిపించిందని.. మళ్లీ ఇన్నాళ్లకు ఇలాంటిదే చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.  దీన్ని ప్లానెట్ పరేడ్ గా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఒకే రేఖపై నాలుగు గ్రహాలు వరుసగా నిలవటం చాలా అరుదుని చెబుతున్నారు.

అయితే.. దీనికి శాస్త్రీయంగా ఎలాంటి నిర్వచనం లేదంటున్నారు. కొందరు ఖగోళ శాస్త్రవేత్తల వాదన ప్రకారం సాధారణంగా మూడు గ్రహాలు ఒక వరుసలో రావటం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. అలాంటి వాటిల్లో సూర్యుడికి ఒకవైపు మూడు గ్రహాలు కనిపిస్తాయి. ఏడాదిలో ఇలాంటివి చాలాసార్లు జరుగుతుంటాయి.

సూర్యుడికి ఒకవైపు ఒకేసారి నాలుగు గ్రహాలు గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయని.. ప్రతి 19 ఏళ్లకు ఐదు గ్రహాలు కూడా వరుసలోకి వస్తాయి.. 8గ్రహాలు సైతం ఒకే వరుసలో వస్తాయి కానీ అందుకు 170 ఏళ్లు పడుతుంది.

కానీ.. ఇప్పుడు ఏర్పడిన వరుస (శుక్రుడు.. అంగారకుడు.. బృహస్పతి.. శని) ఒకే వరుసలోకి రావటం మాత్రం వెయ్యేళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుందని చెబుతున్నారు. మరి.. ఈ ఖగోళ విశేషంపై జ్యోతిష్యులు ఎలాంటి వాదనలు వినిపిస్తారో చూడాలి.
Tags:    

Similar News