లలితా జ్యువెలరీ షోరూం చోరీకి ముందు ఎంత భారీ ప్లానింగ్ అంటే?

Update: 2019-10-21 05:48 GMT
సంచలనంగా మారిన తిరుచ్చి లలితా జ్యువెలరీ షోరూం చోరీకి సంబంధించి ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. షోరూం వెనుక ఉన్న గోడకు భారీగా కన్నమేసి.. లోపలకు వెళ్లి రూ.13 కోట్ల విలువైన ఆభరణాల్ని దోచుకునే అంశానికి సంబంధించి కీలకాంశాలు వెలుగు చూశాయి. షోరూంలో నగలు ఉన్న చోటే ఎలా కన్నమేశారు? వారి అవగాహనకు కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు చూస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

షోరూం చోరీలో కీలక నిందితుడు మురుగన్.. సురేశ్ లు ఇరువురు సదరు షోరూంను పలుమార్లు సందర్శించినట్లు గుర్తించారు. మురుగున్ అయితే తన భార్యను తీసుకొని షోరూంకు పలుమార్లు వెళ్లారని.. ఎక్కడ నగలు ఎక్కువగా ఉంటాయో.. సరిగ్గా ఆ వైపు ఉన్న గోడకు కన్నం వేయాలని నిర్ణయించారు. తన మీద ఎలాంటి అనుమానం రాకుండా ఉండటానికి మరో ఆసక్తికర విధానాన్ని కూడా మురుగన్ అమలు చేశారు.

ఏ ప్రాంతంలో అయినా సరే.. భారీ చోరీ చేయాలని భావించినప్పుడు తాను ఉన్న ప్రాంతం కొన్ని నెలల ముందే  మకాం మార్చే అలవాటు ఉందని గుర్తించారు. చెన్నై అన్నానగర్ చోరీ సమయంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఒక పోలీసు అధికారికి  రూ.30లక్షలు ఇచ్చినట్లు చెప్పటమే కాదు.. తిరువారూర్ పోలీసు అధికారికి ఖరీదైన కారు కొనివ్వటంతో పాటు.. ఒక సినీ నటికి విలువైన ఆభరణాల్ని కానుకగా ఇచ్చిన విషయాన్ని ఈ చోరీలో కీలకంగా వ్యవహరించిన సురేశ్ వెల్లడించినట్లు తెలుస్తోంది.



Tags:    

Similar News