మోడీకి గొడుగు పట్టిన దేశాధినేత‌లు!

Update: 2019-06-16 05:21 GMT
అంత‌ర్జాతీయ స‌మాజంలో భార‌త కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ఎంత‌లా పెరుగుతున్నాయో చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి. అదే స‌మ‌యంలో రెండోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మోడీకి గౌర‌వం ఎంత‌లా పెరిగింద‌న్న వైనం తాజా ఉదంతంలో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. మోడీ కోసం.. ఆయ‌న‌కు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని.. రెండు దేశాల‌కు చెందిన దేశాధినేత‌లు వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మోడీ ప‌ట్ల త‌మ‌కున్న అభిమానాన్ని వారు ప్ర‌ద‌ర్శించిన తీరు ఇప్పుడు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా మారింది. ఇటీవ‌ల విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంద‌ర్భంగా చోటు చేసుకున్న రెండు ఉదంతాలు కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. షాంఘై స‌హ‌కార సంస్థ స‌మావేశాల కోసం కిర్జిగ్ స్థాన్ లోని బిష్కేక్ వెళ్లిన మోడీకి ఆ దేశాధ్య‌క్షుడు సోరోన్ బే జీన్ బెకోవ్ ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. మోడీ వెళ్లే స‌మ‌యానికి వ‌ర్షం కురుస్తోంది.

దీంతో మోడీకి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో మోడీకి గొడుగు ప‌ట్టిన వైనం ఆస‌క్తిక‌రంగా మారింది. స‌హ‌జంగా ఇలాంటి ప‌నులు భ‌ద్ర‌తా సిబ్బంది చేప‌డ‌తారు. కానీ.. అందుకు భిన్నంగా దేశాధినేతే స్వ‌యంగా గొడుగు ప‌ట్ట‌టం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఇదే తీరులో ఇటీవ‌ల శ్రీ‌లంక వెళ్లిన సంద‌ర్భంలోనూ మోడీ ప‌ట్ల ఇలాంటి అభిమానాన్నే ప్ర‌ద‌ర్శించారు ఆ దేశాధ్య‌క్షుడు మైత్రిపాల సిరిసేన‌. మోడీ మీద వ‌ర్షం ప‌డ‌కుండా మైత్రిపాల గొడుగు ప‌ట్టుకోవ‌టం క‌నిపించింది. ఈ రెండు ఉదంతాల్లో త‌మ‌కున్న ప్రోటోకాల్ ను ప‌క్క‌న పెట్టేసి మ‌రీ వ్య‌వ‌హ‌రించిన తీరు చూస్తే.. అంత‌ర్జాతీయ స‌మాజంలో దేశానికి.. మోడీకి పెరిగిన ఇమేజ్ ఎంత‌న్న‌ది కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News