ఆ మాట‌లే..మోడీలోని నిరాశ‌కు నిద‌ర్శ‌నం

Update: 2018-07-22 17:00 GMT
రెండ్రోజుల క్రితమే అవిశ్వాస తీర్మానం వీగిపోయిన ప‌రిణామం ఓ వైపు ఉండ‌గా...కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన ఆ పార్టీకి చెందిన అత్యున్న‌త స‌మావేశం జ‌రిగింది. సీడ‌బ్ల్యూసీని పునర్ వ్యవస్థీకరించిన తర్వాత జరిగిన మొదటి సమావేశంలో కీల‌క అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. 2019 ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జ‌రిగింది. ఈ ఏడాది చివర్లో జరుగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం - పొత్తుల వ్యవహారంపై కూడా సమావేశంలో చర్చించారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సీడబ్ల్యూసీ సమావేశానికి అధ్యక్షత వహించడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో యూపీఏ చైర్‌ పర్సన్ సోనియాగాంధీ - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ - సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే - ఏకే ఆంటోనీ - గులాం నబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ అధ్యక్షతన జ‌రిగిన‌ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మోడీ మాట తీరు ఆయన నిరాశను సూచిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. మోడీకి రివర్స్ కౌంట్ డౌన్ మొదలైందని ఆయన మాటలే ప్రతిబింబిస్తున్నాయన్నారు. ఆర్ ఎస్ ఎస్‌ వ్యవస్థాగత నిర్మాణానికి - ఆర్థిక వనరులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు వ్యూహాత్మక భాగస్వాములు కావాలన్నారు. దీనికోసం వ్యక్తిగత ఆశయాలను పక్కనపెట్టాలన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ మాట్లాడుతూ మోడీ అబద్ధాలు - తనను తాను పొగుడుకునే సంస్కృతిని తిరస్కరిస్తున్నామన్నారు. 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే. అగ్రి గ్రోత్ రేట్ 14శాతం ఉండాలని అదెక్కడా కనిపించడంలేదని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. నూత‌న క‌మిటీ అనుభవం - ఎనర్జీ కలయికగా రాహుల్ అభివర్ణించారు. ఇది గతం -వర్తమానం - భవిష్యత్ ల మధ్య బ్రిడ్జ్ అన్నారు. దేశంలోని పీడిత - బాధిత ప్రజల పక్షాన పోరాడాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కాగా, 2019 ఎలక్షన్స్ లో ఏఏ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలో రాహుల్ గాంధీకి అధికారం కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కొంతమంది పార్టీ నేతలతో ఓ గ్రూప్ ని ఏర్పాటు చేస్తామని - పొత్తుల వ్యవహారం ఆ గ్రూప్ చూసుకుంటుందని సమావేశం తర్వాత రాహుల్ తెలిపారు. కాగా,వచ్చే ఎన్నికలకు ఆర్నెళ్లు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని కోరామని తెలంగాణ రాష్ట్ర నేతలు వెల్ల‌డించారు. ముందుగానే మ్యానిఫెస్ట్ విడుదల చేస్తే బాగుంటుందని తాను సమావేశంలో సూచించినట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Tags:    

Similar News