మోడీ నోట ఇలాంటి మాట?

Update: 2019-04-10 05:28 GMT
విపక్షాల అంచనాలే నిజమయ్యాయి. వారు భయపడినంతా జరిగింది. ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే ప్రధాని మోడీ అభ్యంతరకర అంశాల్ని తన ఎన్నికల ప్రచారంలోకి తీసుకొచ్చి కొత్త వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. తాజా ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కును వినియోగించుకునే యువతను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సోమవారం మహారాష్ట్ర.. కర్ణాటక.. తమిళనాడులో నిర్వహించిన ఎన్నికల సభల్లో మాట్లాడిన ప్రధాని ఊహించని రీతిలో కొన్ని అంశాల్ని తన ఎన్నికల ప్రసంగంలోకి తీసుకొచ్చారు. వైమానిక దాడులు చేసిన వారికి మీ తొలి ఓటును అంకితం చేయగలరా?  వీర జవాన్లకు మీ ఓటును ఇవ్వగలరా? పుల్వామాలో అమరులైన వీరులకు మీరు ఓటు వేయగలరా? ఎందుకంటే తొలి ఓటు జీవితాంతం గుర్తుండిపోతుంది కదా?  అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.

ఫుల్వామా ఉగ్రదాడి.. అనంతరం భారత్ రియాక్ట్ అయిన తీరు.. పాక్ మీద జరిపిన దాడులకు సంబంధించిన భావోద్వేగ అంశాల్ని ఎన్నికల ప్రచారంలో వాడకూడదని.. రక్షణ సిబ్బంది ఫోటోల్ని కానీ.. సమాచారాన్ని కానీ ఎన్నికల ప్రచారంలో నేతలు ప్రస్తావించకూడదన్న గైడ్ లైన్స్ ను ఈసీ ఇప్పటికే జారీ చేసింది. వీటిని తోసి రాజనేలా మోడీతాజా వ్యాఖ్యలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో పాకిస్థాన్‌ వారి మాటల్లా కనిపిస్తోందని.. సాయుధ దళాలకు ఉన్న ప్రత్యేక అధికారాలను, దేశ ద్రోహం నిబంధనలను రద్దు చేస్తామని చెబుతోందన్నారు. ‘‘కాంగ్రెస్‌ కు అవినీతి చేయడం మాత్రమే తెలుసు. కాంగ్రెస్‌ నేతల ఇళ్లల్లో నోట్ల కట్టల పెట్టెలు లభించడం మీరు చూశారు. అయితే వారే ‘చౌకీదార్‌ను’ దొంగ అని అంటున్నారు. ఇప్పుడు నిజమైన దొంగ ఎవరో తెలిసింది కదా!’’ అని వ్యాఖ్యానించారు. 

‘‘దేశంలో చొరబడుతున్న ఉగ్రవాదులపై దాడి చేస్తే మన ప్రతిపక్షాలు కన్నీళ్లు కారుస్తాయి. అసలు ఈ నేతలకు ఓటు హక్కు ఉండేది మన దేశంలోనా? పాకిస్థాన్‌ లోనా?’’ అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ 20వ శతాబ్దంలో అవినీతి సంస్కృతిని ప్రోత్సహించిందని, ఇప్పుడు 21వ శతాబ్దం యువత ఆ పార్టీని శిక్షిస్తోందన్నారు. మోడీ నోటి నుంచి వస్తున్న ఈ మాటలు ఎన్నికల సంఘం నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా నిర్వహించిన ప్రచారంలో మోడీ లక్ష్మణ రేఖను పూర్తిగా దాటేశారని చెబుతున్నారు. తాజా వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు జారీ చేయటమే కాదు.. వెంటనే వివరణ ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. మరి.. తన మాటలపై మోడీ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.


Tags:    

Similar News