హెల్మెట్ చలానాపై సామాన్యుడి మాటకు.. దిమ్మ తిరిగేలా పోలీసుల కౌంటర్

Update: 2022-10-22 04:39 GMT
తప్పు చేయటం ఒక ఎత్తు. ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికి యేషాలు వేసేటోళ్లు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నారు. అలాంటోళ్లకు దిమ్మ తిరిగేలా షాకివ్వటమే కాదు.. నోట వెంట మాట రాకుండా చేస్తున్న పోలీసుల తీరును అభినందించాల్సిందే.

తాజాగా అలాంటి తీరును ప్రదర్శించిన బెంగళూరు పోలీసులపై నెటిజన్లు ప్రశంసల వర్షాన్ని కురిపించటమేకాదు.. అతిగా వ్యవహరించిన వ్యక్తిపై మరింతగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకు వచ్చిన ఒక వ్యక్తికి చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులపై సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్న ఒక వ్యక్తికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తూ.. అతని ఫోన్ కు మెసేజ్ పంపారు. ఈ మెసేజ్ ను పోస్టు చేసిన సదరు వ్యక్తి.. చలానాలో ఉన్న బండి నెంబరు తనదే అయినప్పటికీ.. హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్న ఆధారం లేకుండా చలానా ఎలా వేస్తారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. గతంలోనూ పోలీసులు ఇలానే చేశారని.. అయినప్పటికీ తాను చలానా కట్టానని.. ఈసారి మాత్రం కట్టేదే లేదంటూ  పోస్టు పెట్టాడు. అనూహ్యంగా అతగాడు పోస్టు పెట్టిన కొద్ది నిమిషాల మీదనే బెంగళూరు పోలీసులు రియాక్టు అయ్యారు.

అతడేమాత్రం ఊహించని రీతిలో షాకిచ్చారు. సదరు వ్యక్తి తన బండి మీద హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదరు ఫోటోలో ఆ వ్యక్తి హెల్మెట్ లేకపోవటమేకాదు.. హెడ్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్న వైనం బయటకు వచ్చింది.

దీంతో.. సదరు వ్యక్తి  (ఫెలిక్స్ రాజ్ అనే ట్విటర్ ఖాతాను నిర్వహించే వ్యక్తి) స్పందిస్తూ.. వెంటనే వెనక్కి తగ్గాడు. ఆధారం చూపించినందుకు థ్యాంక్స్ చెప్పిన అతడు.. తన సందేహాన్ని తీర్చిన బెంగళూరు పోలీసులకు ధన్యవాదాలని పేర్కొన్నాడు. తాను ఫైన్ చెల్లిస్తానని చెబుతూ తాను చేసిన బలుపు ట్వీట్ ను తొలగించాడు.

ఈ ఎపిసోడ్ పై నెటిజన్లు రియాక్టు అవుతూ.. అతడు హెల్మెట్ పెట్టుకోకపోవటమే కాదు.. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వైనానికి అదనంగా ఫైన్ వేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. పలువురు.. బెంగళూరు పోలీసుల స్పందనను ప్రశంసిస్తున్నారు.  ఇలాంటి అతిగాళ్లకు ఆ మాత్రం షాకులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News